భయానకరీతిలో ఓ సీలైన్ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. ఓ బాలిక సముద్రం డాక్‌పై కూర్చోని.. నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్ డాక్ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చటపడింది. ఇంతలో ఆ బాలిక డాక్ అంచుల మీద కూర్చోగా.. ఒక్కసారిగా భయానకరీతిలో సీలైన్ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసింది. దీంతో చూపరులు భయాందోళనకు గురై.. కేకలు వేశారు. ఓ వ్యక్తి తెగించి నీటిలోకి దుంకి బాలికను కాపాడాడు. ఇంతలోనే సీలైన్ నీటిలో మాయమైంది.
సీలైన్ అమాంతం నీటిలోకి లాగేసినా.. బాలికకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఆమె తన వారితో కలిసి మామూలుగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ అనూహ్య ఘటన కెనడా పశ్చిమ తీరంలోని వాంకోవర్ పట్టణం రిచ్‌మండ్ బీచ్‌లో శనివారం జరిగింది. యూనివర్సిటీ విద్యార్థిని అయిన ఫుజివరా ఈ ఘటనను స్వయంగా వీడియో తీసింది. నీటిలో తేలియాడుతున్న క్షీరదానికి ఆహారం వేసేందుకు సందర్శకులు ప్రయత్నించారని, ఇంతలోనే బాలికపై అది దాడి చేసిందని ఆమె మీడియాకు తెలిపింది. బాలిక దుస్తులను సీలైన్ ఆహారం అనుకొని ఉంటుందని, అందుకే ఆమెను నీటిలోకి లాగేసి ఉంటుందని నేవీ నిపుణుడు అండ్యూ ట్రైట్స్ తెలిపారు.