రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విడివిడగా కలిశారు.
ఢీల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విడివిడగా కలిశారు. తమ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివ రావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎ.సాయి ప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లతోపాటు మరో ముగ్గురు కనుమూరి బాపిరాజు, మాగంటి శ్రీనివాస రెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి రాష్ట్రపతిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2013 (తెలంగాణ బిల్లు) ముసాయిదాలో లోపాలున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజనపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని వారు రాష్ట్రపతికి చెప్పారు. అందువల్లనే తాము అవిశ్వాసం ప్రకటించినట్లు వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీకి పంపిచే విషయంలో గత సాంప్రదాయం పాటిస్తూ అత్యధిక గడువు ఇవ్వాలని కోరారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ బిల్లును త్వరగా అసెంబ్లీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు రాష్ట్రపతిని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో జాప్యం జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.