రెండున్నర గంటల పాటు సాగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ముగిసింది.
న్యూఢిల్లీ: రెండున్నర గంటల పాటు సాగిన కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం ముగిసింది. కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఉభయ సభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కాంగ్రెస్ పెద్దలు కోరారని తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలు తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆ ప్రాంత ఎంపీలు నమ్మకం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవద్దని కోరామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. బిల్లు పెడితే వ్యతిరేకంగా ఓటెస్తామని చెప్పారు. బిల్లు పెడితే తమ సత్తా చూపుతామని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. సభను క్షణం కూడా నడవనీయబోమన్నారు.
అయితే వార్ రూమ్ భేటీ చాలా బాగా జరిగిందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సమావేశంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారని వెల్లడించారు. సీమాంధ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేసేలా తెలంగాణ బిల్లు ఉంటుందన్నారు.
సీమాంధ్రుల సమస్యలపై దిగ్విజయ్, జైరాం రమేష్ హామీయిచ్చినట్టు తెలిసింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, పోలవరం, వనరుల పంపిణీ అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం. దీంతో సీమాంధ్ర ఎంపీలు కాస్త మెత్తబడినట్టు ప్రచారం జరుగుతోంది.