ముంబై : స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 54.91 పాయింట్లు కోల్పోయి 28,030 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 20.35 పాయింట్లు కోల్పోయి 8700 కీలక మార్కుకు దిగువన 8657 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్లుగా ఉండగా.. బీహెచ్ఈల్, గెయిల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్ నష్టాలను చవిచూస్తున్నాయి.
భారతీ ఇన్ఫ్రాటెల్ 1.7 శాతం పడిపోయి నిఫ్టీలో టాప్ లూజర్గా కొనసాగుతోంది. అయితే ప్రారంభంలో సెన్సెక్స్ 21 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు లాభంలో ట్రేడ్ అయింది. అనంతరం అమ్మకాల ఒత్తిడి ప్రారంభం కావడంతో మార్కెట్లు పడిపోయాయి. కార్పొరేట్ ఆదాయాలపై ఇన్వెస్టర్ ఫోకస్ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో మేజర్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా తన తొలి త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల కానున్నాయి. అదేవిధంగా ఇండియన్ హోటల్స్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు, మింద కార్పొ, మదర్సన్ సుమీ, రాజేష్ ఎక్స్పోర్ట్స్ వంటి కంపెనీ ఫలితాలు కూడా నేడే రానున్నాయి. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి.
అటు డాలర్తో రూపాయి మారకం విలువ 16పైసలు బలపడి 66.68గా ఓపెన్ అయింది. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకుడు ఎన్ఎస్ వెంకటేష్ చెప్పారు. నేటి ట్రేడింగ్లో డాలర్ మారకం విలువతో రూపాయి 66.85-67.05 మధ్య కొనసాగొచ్చని అంచనావేస్తున్నారు.