ఒడిదుడుకుల్లో స్వల్పలాభాలు
ముంబై :తీవ్ర ఒడిదుడుకుల అనంతరం బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 47.81 పాయింట్ల లాభంతో 28,024 వద్ద ముగియగా.. నిఫ్టీ 25.15 పాయింట్ల లాభంతో 8,615వద్ద ట్రేడ్ అయింది. ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్ లాభాలను పండించగా.. డాక్టర్ రెడ్డీస్, ఐటీసీ, రిలయన్స్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంకు నష్టాలను గడించాయి. బ్యాంకు, ఆటో స్టాక్స్ నెలకొన్న కొనుగోలు మద్దతుతో మార్కెట్లు లాభాల్లో నమోదయ్యాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.85 శాతం ఎగిసింది. మరోవైపు ఫార్మా స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫలితాల్లో కుదేలైన డాక్టర్ రెడ్డీస్కు నేడు మార్కెట్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. షేర్లు 10.71శాతం పతనమై, రూ. 2,964గా ముగిసింది.
నేడు నిఫ్టీలో టాప్ గెయినర్గా భారతీ ఎయిర్ టెల్ నిలిచింది. ఈ మొబైల్ టవర్ కంపెనీ క్యూ1 లాభాలను 71శాతం పెంచుకోవడంతో, షేర్లు 4.72శాతం లాభపడి, రూ.380.55గా క్లోజ్ అయ్యాయి. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, యూనిటెడ్ స్పిరిట్స్ సైతం 2.38 శాతం, 4.40 శాతం ఎగిశాయి.
అయితే జీఎస్టీ సవరణ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్స్ లో 60శాతం ఆమోదం పొందుతుందనే మార్కెట్ విశ్లేషకుల అంచనాల నేపథ్యంలో మార్నింగ్ ట్రేడింగ్లో బెంచ్ మార్కు సూచీలు ఫుల్ జోష్లో నడిచాయి. నిఫ్టీ గతేడాది ఏప్రిల్ నాటి గరిష్టంలో ట్రేడ్ అవ్వగా.. బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాది గరిష్టంలో 236 పాయింట్ల పైగా లాభాలను పండించింది. అనంతరం ప్రాఫిట్ బుకింగ్స్, ఇంట్రా ట్రేడ్ గెయిన్స్తో మార్కెట్లు పడిపోయి, తీవ్ర ఒడిదుడుకులో నడిచాయి. చివరికి మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి 0.17 పైసలు లాభపడి, 67.18గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ.85లు నష్టపోయి, రూ.30,827గా నమోదైంది.