
నచ్చితేనే సర్వీస్ చార్జీ
• కచ్చితంగా చెల్లించాల్సిన పనిలేదు.
• హోటళ్లలో బిల్లులపై కేంద్రం
• వినియోగదారుడి విచక్షణమేరకే చెల్లించాలన్న కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: హోటళ్లు, రెస్టారెంట్లలో బిల్లులపై వేసే సర్వీస్ చార్జీని వినియోగదారులు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని, వినియోగదారులు వారి విచక్షణ మేరకు సదరు సేవలు నచ్చితేనే స్వచ్ఛందంగా చెల్లించాలని.. లేదంటే చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. ‘హోటళ్లు, రెస్టారెంట్లు 5 నుంచి 20 శాతం సర్వీసు చార్జీ వసూలు చేస్తున్నాయని చెబుతూ వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.
వారికి పెద్దగా సేవలు అందనప్పటికీ తప్పనిసరిగా, బలవంతంగా సర్వీసు చార్జీ చెల్లించాల్సి వస్తోందంటున్నారు. దీనిపై భారత హోటల్ అసోసియేషన్‌ను వివరణ కోరగా సర్వీసు చార్జీ వినియోగదారుడు సంతృప్తి చెందితేనే చెల్లించాలనే సమాధానం వచ్చింది. దీని ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటలో పేర్కొంది. ఈ మేరకు సర్వీసుచార్జీ చెల్లింపునకు సంబంధించి వినియోగదారులకు కనిపించేలా హోటళ్లలో బోర్డులు ఏర్పాటుచేసేలా రాష్ట్రప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని కేంద్రం కోరింది.