సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు షాక్!
- ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం మీకుందా?
- ఉంటే గవర్నర్‌ను ఎందుకు కలువలేదు?
- కాంగ్రెస్ తీరుపై కోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్‌ను గవర్నర్ ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీకి షాక్ ఎదురైంది. గోవాలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గోవాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్‌పై వాదనలు విన్న సుప్రీంకోర్టు..గోవాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సినంత బలముంటే.. మీరు ఎందుకు గవర్నర్ ను కలువలేదని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. అసలు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఫిగర్ మీ వద్ద ఉందా? అని అడిగింది. సుప్రీంకోర్టు ప్రశ్నల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం 1.30 గంటలకు గవర్నర్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
40 స్థానాలు ఉన్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13, ఇతరులు పది స్థానాలు గెలుపొందారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. మెజారిటీకి దూరంగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో వ్యూహాత్మకంగా పావులు కదిపిన బీజేపీ.. కేంద్ర రక్షణమంత్రిగా ఉన్న పారికర్‌తో రాజీనామా చేయించి.. గోవా ముఖ్యమంత్రిగా బరిలోకి దింపింది. దీంతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, స్వతంత్రులు బీజేపీకి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రే గోవా సీఎంగా పారికర్‌ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రంగా సీఎంగా పారికర్ ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై ఇంకా వాదనలు కొనసాగనున్నాయి.