జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ గురువారం రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
న్యూఢిల్లీ: జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ సహాయ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ గురువారం రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శరద్ యాదవ్ బీహార్ నుంచి, జవదేకర్ మధ్యప్రదేశ్ నుంచి, పటేల్ మహారాష్ట్ర నుంచి ఎన్నికయ్యారు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసే సమయానికి వీరి నామినేషన్లు మాత్రమే ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎల్జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ లోక్‌సభకు వెళ్లడంతో ఆ ఖాళీనుంచి శరద్ యాదవ్ ఎన్నికవగా, బీజేపీ సిట్టింగ్ సభ్యుడు ఫగ్గన్‌సింగ్ కులస్తే ఖాళీ చేసిన సీటునుంచి జవదేకర్ ఎన్నికయ్యారు. కులస్తే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో అక్కడ ఎన్నిక నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో పోటీ అనివార్యమైన సీట్లకు ఈనెల 19న ఎన్నికలు జరగనున్నాయి.