
‘ఈవీఎం టాంపరింగ్ ఆరోపణలు వద్దు’
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన మనదేశంలో ఎన్నికలపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. మాయావతి అనుసరించిన తప్పుడు విధానాల కారణంగానే బీఎస్పీ ఘోరంగా ఓడిపోయిందని జైట్లీ పేర్కొన్నారు.
ప్రజల్లో ఆదరణ పెరగడం, ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవలంభించిన విధానాలు బీజేపీకి సానుకూలంగా మారాయని ఆయన విశ్లేషించారు. డీమోనిటైజేషన్ ను ప్రజలు సమర్థించారని చెప్పుకొచ్చారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కాషాయ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించింది.