
స్నాచర్ల కట్టడికి చట్టాల్లో సవరణ: నాయిని
సాక్షి, హైదరాబాద్: జంట కమిషనరేట్ల పరిధిలో వరుసగా రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారమిక్కడి నాగోలు కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కాలనీ వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుసు దొంగలపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు వారికి తేలిగ్గా బెయిల్ దొరక్కుండా చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను సవరించాలని నిర్ణయించామని హోం మంత్రి చెప్పారు.