డీలా పడొద్దు, పార్టీని బలోపేతం చేద్దాం: సోనియా
న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ తన స్వరం పెంచింది. 2014 ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆపార్టీ పిలుపునిచ్చింది. ఇటీవలి జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలా పడవద్దని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సూచించారు. ఐకమత్యంతో పార్టీలో బలోపేతం చేద్దామని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటమిలు సహజమేనని... ఓటమికి కారణాలను సమీక్షించుకుని ముందుకు వెళదామన్నారు. కాగా పార్లమెంట్లో మహిళా బిల్లు ఇప్పటివరకూ ఆమోదం కాకపోవటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో చాలా వెలితిగా ఉందని సోనియా అన్నారు. పార్టీలోని నాయకుల మధ్య సఖ్యత కొరవడిందని... అందరూ క్రమశిక్షణతో మెలగాలని సూచన చేశారు.
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ యూఏపీ సర్కార్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకు వెళ్లాలన్నారు. కొన్ని పార్టీలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని... అయితే అలాంటి హామీలను తాము ఇవ్వలేమన్నారు. ఇచ్చిన హామీలను యూపీఏ సర్కార్ అమలు చేస్తోందని మన్మోహన్ తెలిపారు. కాగా తొమ్మిదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని తొలిసారిగా ప్రసంగించటం విశేషం. ఈ సమావేశంలో చిదంబరం, రాహుల్ గాంధీ పాల్గొన్నారు.