భారీ భూకంపం.. 15 మంది మృతి
ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని మిండనావో దీవుల్లో సంభవించిన భారీ భూకంపంతో 15 మంది మృతిచెందగా సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు. పలు భవనాలు నేలమట్టం అయ్యాయి, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదైన ఈ భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. సురిగావో నగరానికి 13 కిలోమీటర్ల తూర్పుదిశలో ఇది ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు మాత్రం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
భారీ భూకంపం తర్వాత 89 వరకు ఆఫ్టర్ షాక్స్ వచ్చాయని ఫిలిప్పీన్స్ సిస్మిక్ ఏజెన్సీ అధిపతి రెనాటో సోలిడమ్ తెలిపారు. మరిన్ని ఆఫ్టర్ షాక్స్ రావచ్చని అన్నారు గానీ, వాటివల్ల నష్టం అంత ఎక్కువ ఉండకపోవచ్చని అంచనా వేశారు. 1879లో 6.9 తీవ్రతతో వచ్చిన భూకంపం తర్వాత.. తాజాదే అత్యంత శక్తిమంతమైనది. భూకంపం కారణంగా ప్రజలు అర్ధరాత్రి బయటకు వచ్చి.. పార్కులు, షెల్టర్లలోనే రాత్రంతా గడిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, నీటి సరఫరా ఆగిపోయింది. ఒక బ్రిడ్జి, ఒక హోటల్ కూడా కుప్పకూలాయి. సురిగావో విమానాశ్రయం రన్‌వే మీద పగుళ్లు రావడంతో దాన్ని మూసేశారు.