న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరినీ ఓటరు తిరస్కరించేందుకు వీలుగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘పైవారెవరూ కాదు (నోటా)’కు మెజారిటీ ఓట్లు పోలైనపక్షంలో.. ఆ ఎన్నిక ఫలితాలను నిలిపివేసి తిరిగి ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నిర్దేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాంటి ఆదేశాలు ఇవ్వటం ఇప్పుడు తొందరపాటు అవుతుందని, చట్టాన్ని సవరించాల్సింది చట్టసభేనని.. చీఫ్ జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరినీ తిరస్కరించే హక్కు ఓటర్లకు ఉంటుందనిచ, అందుకోసం ఈవీఎంలలో ‘నోటా’ మీట ఏర్పాటు చేయాలని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. తీర్పు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నుంచే ‘నోటా’ను అమలులోకి తెచ్చింది. మెజారిటీ ఓటర్లు ‘నోటా’ ఓట్లు వేసినట్లయితే ఆ ఎన్నికను రద్దు చేయాలంటూ జగన్‌నాథ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటాను తాజాగా ప్రవేశపెట్టినందున.. దానికి ప్రజలు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంటుందని పేర్కొంటూ పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, రాజకీయాలు నేరపూరితం కాకుండా చూడటానికి అవసరమైన చట్టసవరణలను సిఫారసు చేయటం కోసం.. న్యాయ కమిషన్‌కు నిర్దేశించిన విధివిధానాలను తమకు తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది.
సవరణ చేయాల్సింది చట్టసభలే: సుప్రీంకోర్టు
Published Tue, Nov 26 2013 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 AM
Advertisement