ప్రస్తుతం పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ బాటలోనే సుప్రీం కోర్టుకు చెందిన మరో మాజీ న్యాయమూర్తి ఒక న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది.
న్యూఢిల్లీ: ప్రస్తుతం పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ బాటలోనే సుప్రీం కోర్టుకు చెందిన మరో మాజీ న్యాయమూర్తి ఒక న్యాయ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఇటీవల రిటైరైన న్యాయమూర్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఒక న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ‘మెయిల్ టుడే’ తన తాజా కథనంలో వెల్లడించింది. ఈ కథనం ప్రకారం రెండు వారాల కిందటే బాధితురాలు తన ఫిర్యాదును ప్రధాన న్యాయమూర్తికి పంపినట్లు ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. సీనియర్ న్యాయ అధికారి ఒకరు ఈ మేరకు అఫిడవిట్‌ను సీల్డ్ కవర్‌లో ప్రధాన న్యాయమూర్తికి పంపినట్లు చెప్పాయి. అయి తే, జస్టిస్ గంగూలీ ఉదంతం తర్వాత సమావేశమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, రిటైర్డ్ న్యాయమూర్తులపై ఫిర్యాదులను స్వీకరించరాదని నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయం ఫలితంగా తాజాగా ఫిర్యాదు చేసిన న్యాయ విద్యార్థినికి ఎలాంటి ప్రతిస్పందన లభించలేదని సమాచారం.
గంగూలీపై చర్యలకు కేంద్రం సిద్ధం
న్యాయ విద్యార్థినిని లైంగింకంగా వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొటున్న సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఏకే గంగూలీపై చర్యలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంలో దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టును కోరాలని భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రపతి అభిప్రాయాన్ని కోర్టుకు పంపే అంశంపై న్యాయశాఖ సలహా కోరింది.