
జలాల పంపిణీపై స్పష్టత: సురవరం డిమాండ్
నదీ జలాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. విభజన అనివార్యమని తేలిపోయాక నదీ జలాలు, విద్య, వైద్యం, విద్యుత్ ఉత్పత్తి, ఆస్తుల పంపిణీ తదితర కీలక అంశాలపై చర్చ జరగాలన్నారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన కార్యాలయాలను సీమాంధ్రకు తరలిస్తే వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ఆ ప్రాంతాభివృద్ధికి వెసులుబాటు కలుగుతుందన్నారు. ఢిల్లీలో తాము నిర్వహించిన మతోన్మాద వ్యతిరేక సదస్సు విజయవంతమైందని చెప్పారు.
సంఘ్‌పరివార్ మతం పేరుతో ప్రజలను విభజించడానికి యత్నిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీతో సీపీఐ కలిసివెళుతుందా అని అడగ్గా.. ఆ పార్టీతో పాటు రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీలతో కూడా మాట్లాడామన్నారు. కొన్ని పార్టీలు సమైక్యాన్ని, మరికొన్ని తెలంగాణవాదంపైపు ఉన్నాయన్నారు. తుపాను, అల్పపీడనం వల్ల రాష్ట్రానికి అపార నష్టం వాటిల్లిందని, ఏపీ, ఒడిశాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని తమ పార్టీ తీర్మానం చేసినట్లు చెప్పారు.