పెటాపై పేట్రేగిన హీరో సూర్య!
- జల్లికట్టును వ్యతిరేకించడంపై మండిపాటు
ముంబై: తమిళ అగ్రహీరో సూర్య మంగళవారం జంతు హక్కుల సంస్థ పెటాపై విరుచుకుపడ్డాడు. జల్లికట్టును వ్యతిరేకిస్తున్న పెటా ఇండియా తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. స్థానిక జాతి జంతువుల అంతర్ధానానికి కారణమవుతున్నవారే.. జంతు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని పెటాను ఎద్దేవా చేశారు.
త్వరలో ’సింగం’ సిరీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సూర్య.. జల్లికట్టుకు మద్దతుగా ఆందోళన చేస్తున్నవారికి అండగా నిలిచాడు. స్వచ్ఛందంగా జరుగుతున్న ఈ ఆందోళనలు సబబేనని పేర్కొన్నాడు. జల్లికట్టు ఆట వల్ల ఎద్దులకు హాని జరుగుతుందని పెటా అబద్ధాలను ప్రచారం చేస్తున్నదని సూర్య విమర్శించాడు. అబద్ధాలతో ప్రచారం చేసి న్యాయస్థానంలో విజయం సాధించిన పెటా ప్రజాకోర్టులో ఓడిపోయిందని వ్యాఖ్యానించాడు. జల్లికట్టుపై యువత స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఆందోళనలు త్వరలోనే ఫలితాన్ని ఇస్తాయని సూర్య అన్నాడు. తమిళ సంస్కృతి, వారసత్వాన్ని ప్రమాదంలో పడేసే ఏ చర్యను అయినా.. యువత ప్రతిఘటించాలని సూర్య సూచించాడు.