స్వైన్‌ఫ్లూ నియంత్రణకు ఏర్పాట్లు
మంత్రి లక్ష్మారెడ్డి వెల్లడి
హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ నియంత్రణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, టీజీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ వేణుగోపాలరావు ఇతర అధికారులతో కలిసి బుధవారం గాంధీ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, డిజాస్టర్, మెడికల్ తదితర వార్డులను మంత్రి సందర్శించారు. స్వైన్‌ఫ్లూ రోగులకు అందిస్తున్న సేవలు, ప్రాథమిక సదుపాయాలపై సమీక్షించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి జ్వరాలను అదుపు చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతనెలలో 130 మంది స్వైన్‌ఫ్లూ అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు జరపగా 13 మందికే పాజిటివ్ వచ్చిందని, ఈ నెలలో 221 మందిలో 35 మందికి పాజిటివ్ వచ్చిందని, మూడు మరణాలు సంభవించాయన్నారు. వారి మృతికి, స్వైన్‌ఫ్లూతో పాటు ఇతర వ్యాధులు కూడా కారణమన్నారు.
స్వైన్‌ఫ్లూ ఒక్కటే వస్తే వందశాతం రికవరీ అవుతుందనీ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నారాయణగూడ ఐపీఎంతోపాటు ఫీవర్ ఆస్పత్రిలో కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
రోగులంటే ఇంత చులకనా...
గాంధీ ఆస్పత్రిలో రోగులంటే వైద్యులు, సిబ్బంది చాలా చులకనగా చూస్తూ ఈసడించుకుంటున్నారని పలువురు రోగులు మంత్రి లక్ష్మారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు. కల్వకుర్తి పోల్కంపల్లికి చెందిన వి. దయాకర్ అనే రోగి తీరుపట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరును అతని బంధువులు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాధితుల ఫిర్యాదు మేరకు మంత్రి ఆర్‌ఐసీయును సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.