టాప్ గేర్ లో టాటా మోటార్స్ గ్లోబల్ సేల్స్
ముంబై: ప్రముఖ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ సెప్టెంబర్ గ్లోబల్ హోల్ సేల్ అమ్మకాల్లో టాప్ గేర్ లో దూసుకుపోయింది. ప్రపంచవ్యాప్తంగా లక్ష యూనిట్లకు పైగా వాహనాలను విక్రయించినట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. జాగ్వార్ లాండ్ రోవర్ అమ్మకాలతో కలిపి మొత్త వాహనాల 5.35 శాతం వృద్ధితో 1,02,289 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,102 యూనిట్లను విక్రయించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది.
ప్యాసింజర్ కార్ల విభాగంలో గ్లోబల్ సేల్స్ గణనీయంగా పెరిగాయి. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 7.2 వృద్ధిని సాధించింది. గత ఏడాది 63,334 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది 67,895 యూనిట్ల అమ్మకాలు చేపట్టింది. లగ్జరీ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు గత ఏడాది ఇదే నెలలో 51,074 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 3.6 శాతం వృద్ధిని సాధించింది. 52,914 వాహనాలను విక్రయించింది. వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 1.85 శాతం వృద్ధితో 33.768 యూనిట్లకు విక్రయించింది. గత ఏడాది ఇవి 34, 394 యూనిట్లుగా ఉన్నాయి.