ఆత్మహత్యయత్నం బాధ్యత టీడీపీ, బీజేపీలదే: బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం తిరుపతిలో కోటి అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేయడానికి టీడీపీ, బీజేపీలే బాధ్యత వహించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి ఎన్నికల సభలో నరేంద్రమోదీ, చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదా సాధ్యం కాదంటూ కేంద్ర మంత్రులు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమనే భావోద్వేగాలు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆయన చెప్పారు. ఇప్పుడు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా టీడీపీ, బీజేపీలు వ్యవహరించకూడదని బొత్స అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంతటి పోరాటానికైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. అయితే.. దీనికోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని యువతను కోరుతున్నట్లు చెప్పారు.