
'ఫిరాయింపు'పై టీడీపీలో కుమ్ములాట: ఎంపీపై దాడి
జమ్మలమడుగు: ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టిన వ్యవహారంలో టీడీపీలో చెలరేగిన నిరసన జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశం వేదికగా తమ్ముళ్లు కుమ్ములాడుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీ(రాజ్యసభ) సీఎం రమేశ్‌పైకి కొందరు కుర్చీలు విసిరేశారు. దీంతో సమావేశ ప్రాంగణం అరుపులు, కేకలతో దద్దరిల్లింది.
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తొలి నుంచీ టీడీపీనే నమ్ముకుని పార్టీ ఉన్నతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమకు పదవులు ఇవ్వకుండా నిన్నమొన్న చేరినవారికి మంత్రి పదవులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇంకాస్త రెట్టిస్తూ.. ఆదినారాయణరెడ్డికి.. ఎంపీ సీఎం రమేశ్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని, ఆదికి మంత్రి పదవి దక్కడంలో రమేశ్ ముఖ్యపాత్ర పోషించాడని రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో రామసుబ్బారెడ్డి వర్గీయులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. 'సీఎం రమేశ్.. గో బ్యాగ్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆవేశం పట్టలేని కార్యకర్తలు ఒక దశలో సీఎం రమేశ్ వైపునకు కుర్చీలు విసిరేశారు. 'పార్టీని నమ్ముకున్న మాకు తగిన శాస్తి జరిగింది.. పార్టీ ఫిరాయించినవాళ్లకు మంత్రి పదువులు దక్కాయి..'అని రామసుబ్బారెడ్డి వర్గీయులు వాపోయారు. ఒక్క వైఎస్సార్ జిల్లాలోనేకాక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన అన్ని జిల్లాల్లోనూ టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు, మంత్రిపదవులు దక్కినవారి వ్యతిరేకులు ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. ఇటీవలే గుంటూరు మండలం లో అంబేడ్కర్ స్మృతి వనం పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనందబాబుకు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు మండలం శాకమూరులో అంబేడ్కర్ స్మృతి వనం భూమి పూజకు ఏర్పాట్ల పరిశీలనకు వెళ్లిన మంత్రి నక్కా ఆనంద్ బాబు కాన్వాయ్ ను శ్రవణ్ కుమార్ వర్గీయులు అడ్డుకున్నారు. తమకు సమాచారం ఇవ్వకుండా పర్యటనకు రావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.