
సీఎం రమేశ్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లాలో అధికార పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి రాజుకుంది. మొదట్నుంచీ ఆదినారాయణరెడ్డి రాకను టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయనకు మంత్రిపదవి దక్కడాన్ని జమ్మలమడుగులోని టీడీపీ కార్యకర్తలు, రామసుబ్బారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం రమేశ్ లాబీయింగ్ వల్లే ఆ యనకు పదవి దక్కిందని వీరు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జమ్మలమడుగులో శుక్రవారం సాయంత్రం రామసుబ్బారెడ్డి పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ అక్కడికి చేరుకున్నారు. ఆయనను చూసిన టీడీపీ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కొందరు ఆగ్రహంతో కుర్చీలను సీఎం రమేశ్‌పై విసిరేశారు. ఆయన వైపు దూసుకెళ్లారు. సీఎం రమేశ్ చుట్టూ గన్‌మెన్లు రక్షణ వలయంగా నిలిచారు. గాలిలో లేచిన కుర్చీలు గన్‌మెన్లకు తగిలాయి. మాజీమంత్రి పి.శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ ఓవైపు, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కార్యకర్తలను శాంతింపజేశారు.