తొలి మెడిసిన్ చాక్లెట్!
వాషింగ్టన్: చాక్లెట్ ప్రియులకు ‘తీపి’కబురు. చాక్లెట్ తింటే కొలెస్ట్రాల్, కొవ్వు పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని చాలా మంది నోరు కట్టేసుకుంటారు. అయితే ఈ చాక్లెట్ తింటే అలాంటి ముప్పేమీ ఉండదు. అమెరికాకు చెందిన కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా రక్తపోటును తక్కువగా ఉంచే, మంచి కొలెస్ట్రాల్‌ను శరీరంలో ఉంచే సరికొత్త మెడిసిన్ చాక్లెట్‌ను రూపొందించింది. యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ ఉండే చాక్లెట్, కకోలను దీని తయారీలో వాడారు. సాధారణంగా చాక్లెట్ బార్‌లో కనీసం 70 శాతం కొవ్వు, షుగర్ ఉంటాయి.
అయితే కుకా జోకో రూపొందించిన నమూనా చాక్లెట్‌లో కేవలం 35 శాతమే కొవ్వు, షుగర్ ఉంటాయని ‘మెట్రో’ పత్రిక పేర్కొంది. కోకో మొక్క సారంతో కకోలో ఉండే చేదును తొలగించవచ్చని కంపెనీ ప్రతినిధి అహరొనియన్ చెప్పారు. ఇది చాక్లెట్‌లోని కొవ్వును తొలగిస్తుందని, దీంతో కకో నుంచి లభించే వైద్య ప్రయోజనాలను పొందవచ్చన్నారు. సాధారణ చాక్లెట్‌లో ఉండే కొవ్వును ఇప్పటికి సగానికి తగ్గించామని, అయితే 10 శాతం కొవ్వు, షుగర్ ఉండే చాక్లెట్‌ను తయారుచేయడమే తమ లక్ష్యమన్నారు.