చేతులెత్తి మొక్కుతం
రైతాంగ సమస్యల్ని పరిష్కరించండి: ఎర్రబెల్లి
గజ్వేల్: ‘రెండేళ్లుగా తెలంగాణలో కరువు తాండవిస్తున్నది.. కేంద్రానికి నివేదిక పంపి రైతులను ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం అసమర్థతను చాటుకుంది.. చేతులెత్తి మొక్కుతం.. ఇప్పటికైనా వ్యవసాయరంగాన్ని గట్టెక్కించే మార్గం ఆలోచించాలె.. ’అంటూ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు శశికళతో కలసి పర్యటించారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రానికి కరువు సాయం అందటం లేదన్నారు. పంట వేసింది మొదలు అమ్ముకునే దశ వరకు రైతులకు ప్రభుత్వ సహకారం లభించడం లేదని విమర్శించారు. మూడేళ్ల క్రితం క్వింటాలుకు రూ.4,500 పలికిన పత్తి ధర నేడు రూ.3,500కు పడిపోయిందన్నారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌లో అసహనం పెరిగిపోయి అన్నివర్గాల వ్యక్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
బిల్లులు చెల్లించపోతే పోరాటం.. పెండింగ్‌లో ఉన్న ‘ఇందిరమ్మ’ బిల్లులను చెల్లించకపోతే పోరాటాలు ముమ్మరం చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. రిమ్మనగూడంలో బిల్లులు అందని భీమొల్ల ఎల్లమ్మ, పోషి లక్ష్మీ తదితరుల ఇబ్బందులను ఆయన తెలుసుకున్నారు. ‘ఇందిరమ్మ’ అనర్హులను ఏరివేసే పేరిట ప్రభుత్వం అర్హులకు అన్యాయం తలపెడుతున్నదని విమర్శించారు.