వామ్మో! మద్యం దుకాణమా?
♦ లిక్కర్ షాపుల ఏర్పాటుకు ముందుకు రాని వ్యాపారులు
♦ 20 శాతం పెరిగిన లెసైన్స్ ఫీజు, ప్రివిలేజ్ ట్యాక్స్‌తో వెనక్కు
♦ 2,216 మద్యం దుకాణాలకు గాను 1,393 షాపులకే దరఖాస్తులు
♦ హైదరాబాద్‌లోని 212 దుకాణాలలో కేవలం 24 షాపులకే దరఖాస్తులు
♦ రాష్ట్ర వ్యాప్తంగా 873 దుకాణాలకు రాని దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లిక్కర్ మాఫియా పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని శాసించిన వారంతా ఇప్పుడు చల్లబడ్డారు. వేలం పాటలో రూ. కోట్లు వెచ్చించి మద్యం దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. ఇప్పుడు నిర్దేశించిన ధరకు కూడా దరఖాస్తు చేసుకోవడం లేదు. మద్యం వ్యాపారం నిర్వహించే వారికి ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు, భారీగా పెరిగిన లెసైన్సు ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు తోడు ఎక్సైజ్, పోలీస్ శాఖల వేధింపులకు భయపడి మెల్లమెల్లగా మద్యం వ్యాపారం నుంచి పక్కకు తప్పుకొంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం కింద రెండేళ్లకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు కోరితే స్పందన అంతంత మాత్రమే. వచ్చే సోమవారం దరఖాస్తుల దాఖలుకు చివరి రోజు అయినా రాష్ట్రంలో సగం దుకాణాలకూ దరఖాస్తులు రాలేదు.
873 దుకాణాలకు దరఖాస్తులు నిల్
2015-16, 2016-17 ఆబ్కారీ సంవత్సరాల కోసం ప్రభుత్వం మద్యం విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 21లోపు రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలకు (ఎ-4 షాపులకు) గాను వ్యాపారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. కాగా శనివారం రాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,537 దరఖాస్తులను విక్రయించిన ఎక్సైజ్ శాఖ రూ. 32.69 కోట్లు ఆర్జించింది. శనివారం రాత్రి వరకు 1,393 దుకాణాలకే దరఖాస్తులు అందాయి. ఇంకా 873 దుకాణాలకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌తో పాటు మారుమూల ప్రాంతాల్లోని దుకాణాలకు దరఖాస్తులు రావడం లేదు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 212 దుకాణాలకు గాను కేవలం 24 దుకాణాల కోసం 36 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ అధికారి తెలిపారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రాంతంలో 276, మెదక్ జిల్లా పటాన్‌చెరు, రామచంద్రాపురంలో 15 దుకాణాలున్నాయి. వీటిలో గత సంవత్సరం 104 దుకాణాలను ఎవరూ తీసుకోలేదు. గ్రేటర్‌లో గత ఏడాది లెసైన్సు ఫీజు రూ. 90 లక్షల కన్నా ఈ ఏడాది రూ. 18 లక్షలు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో దుకాణాల పట్ల వ్యాపారుల్లో నిరాసక్తత ఏర్పడింది. అదే సమయంలో హైవేలు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోని దుకాణాలకు డిమాండ్ అధికంగా ఉంది.
ఆయా ప్రాంతాల్లో ఒక్కో దుకాణానికి 3 నుంచి 6 దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం. ఆది, సోమ వారాలు రెండు రోజులు దరఖాస్తులను స్వీకరిస్తారు. గతంలో మద్యం వ్యాపారం అంటే సిండికేట్‌గా సాగేది. ఎక్సైజ్, పోలీసు శాఖలకు మామూళ్లు ముట్టజెపుతూ ఎంఆర్‌పీని పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా ధరలను నిర్ణయించి వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం విక్రయాలు జరిగితే ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో సర్కార్‌కు పన్ను చెల్లించాల్సి రావడం, అక్రమ మద్యం (ఎన్‌డీపీఎల్) రవాణాపై నిఘా, నిర్దేశిత విక్రయ సమయాలు వెరసి మద్యం వ్యాపారులకు లాభాలు లేకుండా చేశాయి. దీనికితోడు ఈసారి 20 శాతం లెసైన్సు ఫీజు పెంచడం కూడా వ్యాపారుల నిరాసక్తతకు కారణమైంది.
అధికారులకు కొత్త తంటా!
మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాకపోవడంతో అధికారులు హైరానా పడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా డిప్యూటీ కమిషనర్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు, సీఐలకు దుకాణాల బాధ్యతను అప్పగించారు. దరఖాస్తులు రాని దుకాణాలలో ప్రస్తుతం వ్యాపారం నిర్వహిస్తున్న వారికి సంబంధిత ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు ఫోన్‌లు చేసి, దరఖాస్తులు సబ్‌మిట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.