
ధైర్యముంటే ‘హోదా’ అక్కర్లేదని చెప్పండి
‘మీట్ ది ప్రెస్’లో చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి సవాలు
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబుకు ధైర్యముంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదని ప్రజలకు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాలు విసిరారు. హోదాపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ‘‘బాబు నాడు 15 ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. పదేళ్లకు తగ్గకుండా ఇవ్వాలని వెంకయ్యనాయుడు రాజ్యసభలో గంటలతరబడి మాట్లాడుతూ కోరారు. ఇప్పుడేమో అబద్ధమాడుతున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు’’ అని ధ్వజమెత్తారు. ఆదివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘మీట్ ది ప్రెస్’లో ఉండవల్లి మాట్లాడారు. ‘హోదా’ పై కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వెటకారంగా మాట్లాడారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధిస్తామన్నారు. తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోందంటూ.. రాష్ర్ట విభజన తప్పని తప్పకుండా తీర్పు వస్తుం దనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
పట్టిసీమలో భారీ అవినీతి..
పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అవినీతి బాగా కనిపించిందని ఉండవల్లి అన్నారు. తాను దేశంలో పేరున్న కన్సల్టెన్సీ నుంచి పట్టిసీమ ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారుచేసి బాబుకిచ్చానన్నారు. దీని విలువ రూ.400 కోట్లని, కానీ చంద్రబాబు దీన్ని పట్టించుకోలేదని చెప్పారు. వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో అవి నీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. పోలవరం పూర్తి చేయమంటే బాబు పంపుసెట్లు పెడుతున్నారని, ఇంతకంటే అవినీతి ఏముం టుందన్నారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధానిని నిర్మించడమంటే దోపిడీకి పెద్ద మార్గమని అభివర్ణించారు.
మార్గదర్శిపై విచారణ జరుగుతోంది
తాను ఏ కేసునూ వదిలేయలేదని, మార్గదర్శి సంస్థపై తాను వేసిన ఇంప్లీడింగ్ పిటిషన్‌పై విచారణ జరుగుతున్నదని ఉండవల్లి చెప్పారు. తాను రాజకీయాల్లో ఉన్నా ఎన్నికల్లో పోటీ చేయనన్నారు.