హలో.. నేను డీఐజీని మాట్లాడుతున్నా
విశాఖపట్నం: సమయం అర్ధరాత్రి సుమారు 2 గంటలు..పోలీస్ కంట్రోల్ రూమ్‌లో ల్యాండ్ ఫోన్ మోగింది..నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది ఫోన్ లిప్ట్ చేసి ‘హలో సర్..పోలీస్ కంట్రోల్ రూమ్’అనగానే అవతలి వ్యక్తి ‘హలో..నేను డీఐజీని మాట్లాడుతున్నా..’అన్నాడు. డీఐజీ అనగానే అత్యంత గౌరవంతో సర్ సర్ చెప్పండి సర్ అని పోలీస్ సిబ్బంది అడిగారు. ఈ మధ్య కాలంలో జ్యోతి అనే మహిళపై ఏవైనా కేసులు నమోదయ్యాయేమో చూసి చెప్పమని ఫోన్ పెట్టేశాడు.
డీఐజీ అడగడంతో వెంటనే అన్ని రికార్డులు తిరగేసి, అన్ని స్టేషన్లకు ఫోన్లు చేసి కేసు గురించి ఆరా తీశారు. ఎక్కడా అలాంటి కేసు నమోదు కాలేదని అన్నిచోట్ల నుంచీ సమాధానం వచ్చింది. ఇంతలో మళ్లీ అదే ఫోన్‌కాల్..గడిచిన 10 రోజుల్లో ఎవైనా కేసులు నమోదయ్యాయేమో చూడమని మళ్లీ ఆదేశం.
మరోసారి సిబ్బంది పరుగులు..ఇలా దాదాపు రెండు గంటల పాటు కంట్రోల్ రూమ్ ఫోన్ మోగుతూనే ఉంది. తెల్లవారాగా విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. అప్పుడు గానీ ఫోన్ చేసింది అపరిచితుడని వారికి అర్ధం కాలేదు. ఎవరో ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా ఎలా స్పందించేస్తారంటూ ఉన్నతాధికారి సిబ్బందిని మందలించి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయమన్నారు. వారు రెండవపట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.