హెచ్-1బీ వీసాదారుల నెత్తిన మరో బాంబు
వాషింగ్టన్: ట‌్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాదారులకు మరో బాంబు వేయడానికి రడీ అవుతోంది. వీసా సంస్కరణలు, ప్రీమియం వీసాలపై తాత్కాలిక నిషేదం లాంటి సంచలన నిర్ణయాలతో భారత ఐటీ ఉద్యోగుల గుండెల్లో గుబులుపుట్టిస్తున్న అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. హెచ్-1బీ వీసా హోల్డర్ల భాగస్వాములకు(భార్యలేదా భర్త), హెచ్-4 వీసాదారులపై వేటు వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం వలస కార్మికులు విదేశీ ఉద్యోగులను ఏరివేసే క్రమంలో మరింత దూకుడుగా కదులుతోంది. చట్టబద్దంగా అనుమతి వున్న ఉద్యోగులపై వేటు వేసేందుకు యోచిస్తోంది. ఈ క్రమంలో హెచ్-1బీ వీసా దారులు అమెరికాలో పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అయితే ఇప్పుడా అనుమతిని రద్దు చేసే యోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దీనిపై వాషింగ్టన్ కోర్టులో డిపార్ట్ మెంట్ ఆఫ్ జస్టిస్ 60 రోజుల గడువు కోరింది. దీంతో వేలాదిమంది భారతీయ ఐటీ ఉద్యోగుల భాగస్వాముల( హెచ్-4 వీసాదారులు) ఉద్యోగులు ప్రమాదంలో పడనున్నాయనే ఆందోళన నెలకొంది.
అయితే హెచ్-4 వీసాదారులు (హెచ్-1బీ వీసాదారులపై ఆధారపడేవాళ్లు) ఎన్నో ఏళ్లపాటు పోరాడి ఈ అనుమతిని సంపాదించారు. 2015, ఫిబ్రవరిలో అప్పటి ఒబామా ప్రభుత్వం ఈ అనుమతినిచ్చింది. తద్వారా గ్రీన్‌కార్డు కోసం వేచి చేస్తున్న హెచ్-1బీ వీసాదారుల భాగస్వాములకు ఈ అవకాశం లభించింది.
ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే గ్రూప్ కోర్టుకు వెళ్లింది. కానీ ఇందులో తాము జోక్యం చేసుకోలేమని అప్పట్లో కోర్టు చెప్పింది. తాజాగా ట్రంప్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టగానే ఈ గ్రూప్ మరోసారి అప్పీల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ మద్దతు కూడా లభించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 60 రోజుల సమయం కోరింది. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా ఉన్న జెఫ్ సెషన్స్.. అప్పట్లో సెనేటర్‌గా ఒబామా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అయితే అమెరికాలో భారీగావున్న ఈ హెచ్-4 వీసాదారుల తరఫున ఇమ్మిగ్రేషన్ వాయిస్ అధ్యక్షుడు అమన్ కపూర్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి సరైన ఆధారమే లేదని అమన్ కపూర్ వాదిస్తున్నారు.