యువతను మోసగించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ తెలంగాణ యువతలో కలలు పెంచి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. వారిని నిలువునా మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం.అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు ఆర్.సి.కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడారు.
తెలంగాణలో ఇంటికో ఉద్యోగం, యువతకు ఉపాధికల్పన అని ఊదరగొట్టిన కేసీఆర్... ఇప్పటిదాకా ఒక్కరికీ ఉద్యోగాన్ని, ఉపాధినీ కల్పించలేదని విమర్శించారు. కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడి యువత భవితను మార్చాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్‌పై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ కుటుంబ అరాచకాలపై, అవినీతిపై యువత పోరాడాలని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పిలుపు ఇచ్చారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లేసిన యువత ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉందని... కాంగ్రెస్ భావజాలాన్ని, యువత పట్ల అంకితభావాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని జానారెడ్డి సూచించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ... పార్టీ అగ్రనేతల సహకారంతో ప్రభుత్వాలపై పోరాడతానని పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యన్నారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, డీకే అరుణ, గీతారెడ్డి, బలరాం నాయక్, మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
మాజీ యువజన నేత ఎక్కడ?
యువజన కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్‌కుమార్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఓడిపోయిన రవికుమార్ యాదవ్, ఆయన ప్యానెల్‌లో గెలిచిన రాష్ట్ర కార్యవర్గంలోని నేతలు కూడా పాల్గొనలేదు. అయితే యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకారం సంగతి తనకు తెలియదని, తనను ఆహ్వానించలేదని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.