ఈ హింస నా వల్లకాదు..బతకాలని లేదు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలికి చెందిన ఓ మహిళ ఎదుర్కొన్న అమానుషమైన లైంగిక దాడి, భయంకరమైన అనుభవాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. దళిత మహిళ(46) అటు జీవితంతో,ఇటు ఆధిపత్య వర్గానికి చెందిన మృగాళ్లతో అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఓడిపోతున్నా..పడి లేచినా కెరటంలా నిలబడి యాసిడ్ బాధితులకు స్ఫూర్తిగా నిలిచింది. అయినా తానీ హింసను భరించ లేనంటోంది. ఈ బాధను సహించలేను.. తనకు జీవించాలనే కోరిక చచ్చిపోయిందంటోంది. న్యాయం జరుగుతుందనే ఆశ చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శరీరమంతా వెక్కిరిస్తోన్న యాసిడ్ గాయాలు కంటే మించిన బాధతో హాస్పిటల్ బెడ్ మీద విలవిల్లాడుతోంది.
గ్యాంగ్ రేప్ , ఐదు యాసిడ్ దాడుల హింసకు బలైన ఈ మహిళ విషాద గాధ వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఈ బాధితురాలు 9 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. ఓ భూ వివాదంలో 2008 లో ఠాకూర్ యువకుల ముఠా ఈమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధైర్యంగా నిలబడి ఈ కేసులో నిందితులను అరెస్టు చేయించింది. దీంతో కక్షగట్టిన ఆ దుర్మార్గులు 2011 , 2012లో రెండుసార్లు, 2013 యాసిడ్ దాడి చేశారు. దీనికి శరీరమంతా కప్పేసిన కాలిన గాయాలే సాక్ష్యాలు.
యాసిడ్ బాధితులో కోసం ఏర్పాటు చేసిన షీరోస్ కెఫేలో పనిచేస్తున్న ఆమె మరోసారి విషాదం వెంటాడింది. హోలీ పండుగకి ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలి లో ని ఇంటికి వెళ్లి తిరిగివ లనోవ్ తిరిగి వస్తుండగా మార్చి 24న రైలులో మరోసారి యాసిడ్ దాడి చేశారు. త్వరలో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో కాపు కాసిన ప్రధాన నిందితులు గుడ్డూసింగ్, బొడ్డు సింగ్ ఆమెపై దాడిచేసి , నోటిలో బలవంతంగా యాసిడ్ కుమ్మరించారు. దీంతో ఆమె నోరు, దవడ, గొంతు, ఆహార నాళిక కాలిపోయాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె ఐదురోజుల తర్వాత కనీసం నోరు తెరవలేని స్థితిలో తన ఘోషను కేవలం సైగల ద్వారా భర్తకు వివరించింది.
కాగా లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద ఆమెకు రూ.1లక్ష పరిహారాన్ని ప్రకటించారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఈ మహిళకు న్యాయం జరుగుతుందా..కాలమే తేల్చాలి.