రావత్‌పై ముడుపుల ఆరోపణలు
* ఉత్తరాఖండ్ సీఎం వ్యక్తిగత కార్యదర్శిపై స్టింగ్ ఆపరేషన్
* సీడీ విడుదల చేసిన కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
న్యూఢిల్లీ: అవినీతి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దాడిచేస్తున్న కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురు దాడి ముమ్మరం చేసింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీశ్‌రావత్.. ప్రయివేటు పంపిణీదారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని మార్చివేసి డబ్బులు మూటగట్టుకున్నారని ఆరోపిస్తూ.. ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా ఆ పార్టీ నేతల అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. కేరళ మొదలుకొని అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరూ దోపిడీ వ్యాపారులుగా మారారని.. వారు గాంధీ కుటుంబానికి కమిషన్లు ఇస్తున్నారని పేర్కొంది.
రావత్‌ను తక్షణమే తొలగించాలి
డెహ్రాడూన్‌లో మద్యం పంపిణీని ప్రభుత్వ సంస్థలకు కాకుండా ప్రయివేటు పంపిణీదారులకు ఇచ్చేందుకు తనకు ముట్టజెప్పాల్సిన కమిషన్లపై.. ప్రయివేటు మద్యం పంపిణీదారులు, మధ్యవర్తులుగా చెప్తున్న వారితో హరీశ్‌రావత్ వ్యక్తిగత కార్యదర్శి మొహమ్మద్ షాహిద్ బేరమాడుతున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యంతో ఒక సీడీని బీజేపీ నేత, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో విడుదలచేశారు.
ఈ సీడీలోని దృశ్యాల్లో రావత్ లేరు. కానీ సీఎం కార్యదర్శి షాహిద్ బేరమాడుతున్నారని నిర్మలా పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కార్యదర్శి కూడా అయిన షాహిద్.. సీఎం రావత్‌తో ఎంతో కాలంగా పనిచేస్తున్నారని.. రావత్ గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నపుడు కూడా ఆయనతో కలిసి షాహిద్ పనిచేశారని ఆమె చెప్పారు. రావత్ ఉత్తరాఖండ్‌లో మద్యం విధానాన్ని వక్రీకరించి ముడుపులు దండుకుంటున్నారని.. ఆయనను కాంగ్రెస్ పార్టీ తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.
దేశం దృష్టి మరల్చటానికే: రావత్
డెహ్రాడూన్: బీజేపీ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్ తిరస్కరించారు. తమ పార్టీ అగ్రనేతల కుంభకోణాల నుంచి దేశం దృష్టిని మరల్చాలనే ఇటువంటి నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. అయితే.. ఆ వీడియో టేపుపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని ఆదేశించినట్లు రావత్ తెలిపారు.