సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారంనాటి పరిణామాలు దురదృష్టకరమేనని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎంపీలనే మార్షల్స్‌గా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని ఆరోపించారు. సభనుంచి సస్పెన్షన్‌కు గురైన ఉండవల్లి,... రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావుతో కలిసి గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రేతో ఎంపీలను గాయపరిచినట్టు చెబుతున్నారని, అసలు నిరంకుశంగా విభజన బిల్లు తెచ్చి, కేంద్రమే రాజ్యాంగాన్ని గాయపరిచిందని అన్నారు. ‘టీడీపీ ఎంపీ మోదుగులను కాపాడేందుకే లగడపాటి పెప్పర్‌స్ప్రే వాడారు. తనపై దాడిచేస్తున్న వారిని అడ్డుకునేందుకే లగడపాటి స్ప్రే వాడారు. నేను చాలా దగ్గరినుంచి చూశాను.
సభలోని 12 కెమెరాల రికార్డులను బయటపెడితే ఎవరిపై ఎవరు దాడిచేశారో తెలుస్తుంది. పూర్తిస్థాయి విచారణకోసం వీడియోలను బహిర్గతపరచాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’ అన్నారు. విభజనపై ఇరుప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలను కూర్చోపెట్టి మాట్లాడే ప్రయత్నమే చేయలేదని ఉండవల్లి అన్నారు. విభజన బిల్లు పాస్ అవుతుందో, లేదో ఎవరికీ తెలియదని, బీజేపీ కి స్పష్టత లేదని ఆయన వ్యాఖ్యానించారు.