
'పుట్టినరోజున ఇచ్చిన మాటైనా నిలబెట్టుకో బాబూ'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో హంద్రీ-నీవాకు రూ.13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది వాస్తవం కాదా? అంటూ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు కనీసం పుట్టినరోజు నాడు ఇచ్చిన మాటనైనా నిలబెట్టుకోవాలన్నారు. వైఎస్ హయాంలోనే హంద్రీ-నీవా పనులు వేగవంతంగా జరిగాయని ఆయన అన్నారు.
హంద్రీ-నీవా కాలయాపనకు మీరు కారణం కాదా? అంటూ ఆయన చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలు దుర్భర జీవితం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ' సింగపూర్, జపాన్ పక్కన పెట్టి రైతుల గురించి ఆలోచించండి' అంటూ హితవు పలికారు. ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని వై. విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.