జవాన్ల చూపుడువేళ్లే మాట్లాడతాయి
రాహురి/బారామతి(మహారాష్ట్ర)/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ బలగాల కవ్వింపు చర్యలపై తాను మాట్లాడాల్సిన పని లేదని, ట్రిగ్గర్లపై ఉన్న భారత జవాన్ల చూపుడువేళ్లే దీనిపై మాట్లాడతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పాక్ దుశ్చర్యలకు భారత బలగాలు తిరుగులేని సమాధానం ఇస్తున్నాయని మోదీ భారత సైనిక దళాలను ప్రశంసించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. పాక్ దళాల కాల్పులపై తాను స్పందించడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలకు మోదీ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నా ఆలోచనలేంటో ప్రజలకు తెలుసు. వాటిని విశదీకరించాల్సిన అవసరం లేదు. మన జవాన్లు మాట్లాడాల్సి వస్తే.. ట్రిగ్గర్‌పై ఉన్న వారి చూపుడువేళ్లే మాట్లాడతాయి.
ఇకముందు కూడా వారు అలాగే మాట్లాడతారు’ అని మోదీ అన్నారు. సరిహద్దుల్లో పాకిస్థాన్ జరుపుతున్న కాల్పులను ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం బహిరంగంగా చర్చకు పెట్టడం సబబుకాదని సూచించారు. దేశ భక్తిని మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలనీ హితవు పలికారు. గురువారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో మోదీ ప్రసంగిస్తూ.. ‘సరిహద్దుల్లో కాల్పులు జరుపుతూ శత్రువు భయాందోళనలు సృష్టిస్తోంది. భారత్‌లో పరిస్థితులు మారాయని, మునపటిలా వ్యవహరిస్తే సహించబోమని మన శత్రువులకు ఇప్పటికే అర్థమైంది’ అని భారతదేశ వైఖరిని మోదీ స్పష్టం చేశారు.
ఏనాడైనా బోర్డర్‌కు వెళ్లావా?: ఎన్సీపీ కొంచుకోట అయిన బారామతిలో ఎన్నికల ప్రచార సభ సందర్భంగా మాజీ రక్షణ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ఆయన అల్లుడు అజిత్ పవార్‌పై మోదీ విరుచుకుపడ్డారు. ‘రక్షణమంత్రిగా ఉండగా.. పాక్, చైనాలతో సరిహద్దు సమస్యలు తలెత్తినప్పుడు ఏ నాడైనా సరిహద్దు వద్దకు వెళ్లావా? నీ హయాంలో ముంబై, మాలేగావ్, పుణెల్లో పేలుళ్లు జరిగితే.. కనీసం ఆ ఉగ్రవాదుల ఆనవాళ్లైనా గుర్తించారా?’ అని శరద్‌పవార్‌ను మోదీ ప్రశ్నించారు. దేశభక్తితో ఈ అంశాలను తాము ఎప్పుడూ రాజకీయం చేయలేదని చెప్పారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయని, సరిహద్దుల్లో పోరాటాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం చర్చకు పెట్టి జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని మోదీ సూచించారు. నీటి కోసం ఓ రైతు 55 రోజులు దీక్ష చేస్తే..దీనిని పట్టించుకోని అజిత్ పవార్ డ్యామ్‌లో నీరు లేకుంటే ఎలా ఇస్తాం.. మూత్రంతో డ్యామ్‌ను నింపుతామా అని ప్రశ్నించిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు.
కాంగ్రెస్-ఎన్సీపీ తెగదెంపులు ఓ నాటకం
మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్‌సీపీ విడిపోవడం ఒక నాటకమని, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల దృష్టిని మరల్చేందుకు వారు వేర్వేరుగా పోటీ చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఎన్నికలకు ముందు మాత్రమే కాంగ్రెస్, ఎన్సీపీ తెగదెంపులు చేసుకున్నాయని, కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటే అని అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రధాని రాజధాని ఢిల్లీలో ఉండకుండా.. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో మునిగిపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.