
మోదీ సర్కారు కొత్తగా చేసిందేంటి?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం 2011లో ప్రవేశపెట్టిన తయారీ విధానంను 'మేకిన్ ఇండియా'గా మార్చారని తెలిపారు. నిర్మల్ భారత్ కు స్వచ్ఛ భారత్ గా నామకరణం చేశారని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ పథకం పేరును స్కిల్ ఇండియా మార్చారని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
ఇతర పథకాల పేర్లు కూడా ఇలాగే మార్చేశారని చెప్పారు. మోదీ సర్కారు కొత్తగా ప్రజలకు చేసిందేముందని ఆయన ప్రశ్నించారు. అధికారంలోని వచ్చిన 100 రోజుల్లో విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కు రప్పిస్తామన్న హామీని మోదీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. 26/11 దాడి జరిగి నేటికి ఏడేళ్లు పూర్తైన నేపథ్యంలో తీవ్రవాదంపై ఐక్యంగా పోరాడాలని ఆయన ఆకాంక్షించారు.