
ఇద్దరు ప్రధానులు పదవి నుంచి దిగిపోవాలి!
భారత్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులకు శనివారం ఉదయం ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.
- కార్యక్రమ వ్యాఖ్యత అసంబద్ధ వ్యాఖ్యలతో నవ్వులే నవ్వులు!
న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ ప్రధానమంత్రులకు శనివారం ఉదయం ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది. ఇద్దరు ప్రధానులు ఉమ్మడిగా విలేకరుల సమావేశం నిర్వహించిన సందర్భంగా.. వారిద్దరినీ పదవి నుంచి దిగిపోవాలంటూ కార్యక్రమ వ్యాఖ్యాత పేర్కొనడం.. ఒకింత విస్మయాన్ని పంచింది.
భారత పర్యటనకు వచ్చిన బంగ్లా ప్రధాని హాసీనా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వీరి భేటీలో 22 ఎంవోయూలకు అంగీకారం కుదిరింది. సంప్రదాయం ప్రకారం ఇరువురు నేతల మీడియా సమావేశంలో ఈ ఒప్పందాలపై లాంఛనప్రాయంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎలివేటెడ్ పొడియం నుంచి దిగాల్సిందిగా కోరుతూ కార్యక్రమ వ్యాఖ్యత పొరపాటు వ్యాఖ్యలు చేశారు. 'ఇద్దరు ప్రధానమంత్రులను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా నేను కోరుతున్నాను' అంటూ పేర్కొన్నారు. ఈ కామెంట్‌ను వెంటనే అర్థం చేసుకున్న ప్రధాని మోదీ నవ్వులు రువ్వారు. అటు నుంచి హసీనా నవ్వుతూ పొడియం దిగారు. ఈ తొందరపాటు వ్యాఖ్యను సరదాగా తీసుకున్న ఇద్దరు దాదాపు ఒక నిమిషంసేపు నవ్వుల్లో మునిగిపోయారు.