
ముద్దు వెనక మూడు కారణాలు!!
ము..ము.. ము.. ము.. ముద్దంటే చేదా? నీకా ఉద్దేశం లేదా అని ఏనాడో పాటు పాడించారు సినీ రచయితలు, దర్శకులు. ఇంతకీ అసలు ముద్దు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అవును.. ఉంటుందట. అనుబంధాలను మరింత పటిష్ఠం చేసేందుకు ముద్దు ఉపయోగపడుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. దాంతో పాటు మరో మూడు కారణాలనూ వివరించారు. భాగస్వాములను ఎప్పటికీ తమతోనే ఉండేలా చేసుకోవాలన్నా కూడా అధరామృతమే దివ్యౌషధమని అంటున్నారు.
''మానవ లైంగిక సంబంధాల్లో ముద్దుకు చాలా ప్రధానమైన పాత్ర ఉంది. ఇది ప్రతి సమాజంలోను, ప్రతి సంస్కృతిలోనూ ఉంది'' అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ప్రయోగాత్మక సైకాలజీ విభాగంలో పరిశోధన విద్యార్థిగా ఉన్న రఫెల్ వ్లోడార్స్కీ చెప్పారు. చింపాంజీలు, ఇతర జంతువులు, కొన్ని రకాల పక్షుల్లో కూడా ఇలా ముద్దుపెట్టుకోవడం ఉందని వివరించారు. మనుషులలో ఇది చాలా విస్తృతంగాను, వేర్వేరు చోట్ల వేర్వేరుగా విభిన్నంగాను ఉందన్నారు. అయితే, ఇది అంత విస్తృతంగా ఎందుకు వ్యాపించిందో మాత్రం తెలియదని చెప్పారు.
ముద్దు వెనక ప్రధానంగా మూడు కారణాలున్నాయని రఫెల్ అన్నారు. భాగస్వాములను ఎంచుకోడానికి ఇది ప్రధాన సాధనం అని, అవతలి వారిలో లైంగిక వాంఛలను పెంచడానికి ఉద్దీపనంలా పనిచేస్తుందని, అనుబంధాలను పటిష్ఠం చేసుకోడానికీ ఉపయోగిస్తుందని అన్నారు. ఈ సిద్ధాంతాలపై మరింత లోతుగా పరిశోధనలు చేస్తామంటున్నారు.