మోదీ చేయి చాచలేదు
పాక్‌తో స్నేహ సంబంధాల కోసం యత్నించారు: రాజ్‌నాథ్
నాసిక్: ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ ముందు చేయి చాచలేదని, ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణను ఆ దేశం ఉల్లంఘిస్తే.. తగిన రీతిలో గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. రష్యాలోని ఉఫాలో మోదీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భేటీకావడం, అనంతరం కశ్మీర్ అంశం ఎజెండాలో లేకుండా చర్చలు ఉండవంటూ పాక్ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ వ్యాఖ్యానించడంతో దుమారం రేగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ మంగళవారం మహారాష్ట్రలోని నాసిక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘మోదీ పాకిస్తాన్ ఎదుట చేయిచాచలేదు. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. ఒకవేళ పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే మన సైన్యం అందుకు దీటుగా బదులిస్తుంది’ అని అన్నారు. అజీజ్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య జరిగే చర్చలపై ప్రభావం చూపించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉఫాలో మోదీ, షరీఫ్‌ల చర్చల తర్వాత వెలువరించిన సంయుక్త ప్రకటన స్ఫూర్తి కొనసాగుతుందని, పాక్‌తో చర్చలు జరుగుతాయని అన్నాయి.
‘చిత్తు కాగితం విలువ చేయదు’
రష్యాలో భారత్-పాక్ ప్రధానుల భేటీపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. పాక్ తన వైఖరి మార్చుకోనప్పుడు ఉఫా చర్చలు కేవలం కంటితుడుపు చర్యే అని విమర్శించింది. అసలు మోదీ ఏ ప్రాతిపదికన ఈ చర్చల నిర్ణయం తీసుకున్నారో వెల్లడించాలని ఆ పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఉఫా చర్చల సందర్భంగా విడుదలైన సంయుక్త ప్రకటనకు చిత్తు కాగితం పాటి విలువ లేదన్నారు.
రాష్ట్రపతి ఇఫ్తార్‌కు మోదీ దూరం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ కిందటి ఏడాదిలాగే ఈసారి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరుకావడం లేదు. రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ఇఫ్తార్ విందు జరిగే సమయానికి, రాత్రి ఏడుగంటలకు మోదీ ఈశాన్యరాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది.