దీప మద్దతిస్తానంటే తీసుకుంటా: పన్నీర్
► గవర్నర్ తమిళనాడు రాగానే కలుస్తా
► కేంద్రం మద్దతిస్తామంటే తప్పకుండా తీసుకుంటా
► అమ్మ నన్ను రెండుసార్లు సీఎం చేశారు
చెన్నై
జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ మద్దతిస్తానంటే తప్పకుండా తీసుకుంటానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం చెప్పారు. శశికళ పార్టీకి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉంటారని తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయన కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తమిళ ప్రజలకు అండగా ఉందని, తమిళ ప్రజలకు ఎవరు మద్దతిచ్చినా దాన్ని తాము అంగీకరిస్తామని పన్నీర్ సెల్వం చెప్పారు.
తాను ప్రజల్లోకి వెళ్తానని, తమిళనాడులో ప్రతి నగరానికీ వెళ్లి తాను అనుకుంటున్న విషయాలు ప్రజలకే చెబుతానని అన్నారు. తన బలమేంటో అసెంబ్లీలో తప్పకుండా నిరూపించుకుంటానని తెలిపారు. గవర్నర్ ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఆయన తిరిగి రాగానే తాను ఆయనను కలుస్తానని కూడా వివరించారు. జయలలిత 16 సంవత్సరాల పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆమె తనను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారని, ఇదంతా అమ్మ కోరిక మాత్రమేనని, తాను ఆమె అడుగు జాడల్లో నడుస్తానని అన్నారు.