గిన్నిస్‌కెక్కిన ‘చిన్నోడు’
కొలంబియాలోని బొగొటాలో నివసించే ఎడ్వర్డ్ హర్నాడేంజ్(28) ఎత్తుగా లేకపోయినా ఎంతో ‘ఎతు’కు ఎదగాలనుకున్నాడు. తనకంటూ సొంతంగా సాగుభూమి ఉండాలని, జీపులో స్వేచ్ఛగా విహరించాలని, అందమైన అమ్మాయి మనసులో చోటుసంపాదించుకోవాలని... ఇలా చాలానే కోరుకున్నాడు. కానీ, పాపం... 28 ఏళ్ల వయసున్న హర్నాడేంజ్‌కు 27 అంగుళాల తన ఎత్తు ప్రతిచోటా ప్రతిబంధకంగా మారింది.
అందరూ తనను బొమ్మగా భావించి ఎత్తుకోవడం, ఎక్కడా సరైన ఉద్యోగం లభించకపోవడం, కనీసం ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా లేకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేసింది... పొడుగు పెరగకపోవడం శాపమని భావించి, నిత్యం కుమిలిపోయేవాడు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది... అమ్మాయి మనుసులో చోటుదక్కలేదని ఫీలయిన మన చిన్నోడి పేరు ఇప్పుడు ఏకంగా గిన్నిస్‌బుక్‌లోకే ఎక్కింది.
ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి(చైనా) మరణించడంతో గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఇప్పుడు 27 అంగుళాలున్న హర్నాడేంజ్‌నే ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తిగా గుర్తించారు. ఇంకేముంది రాత్రికిరాత్రే ప్రపంచవ్యాప్తంగా హర్నాడేంజ్ పేరు మారుమోగిపోయింది. సొంతగా జీపు కొనుక్కోవాలనే తన కల కూడా త్వరలోనే నెరవేరబోతుందట. కానీ, ప్రపంచంలోనే అత్యంత పొట్టైన టీనేజర్‌గా రికార్డు సృష్టించిన కజేంద్రథప్పామగర్(నేపాల్) త్వరలోనే హర్నాడేంజ్ రికార్డును బద్దలుకొట్టబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని హర్నాడేంజ్ లైట్ తీసుకుంటున్నాడు. తన కలలన్నీ నెరవేరాక, అమ్మాయి మనసులో చోటుదొరికాక ఇంకా గిన్నిస్‌బుక్‌లో చోటెందుకు అంటున్నాడు.