
సునామీని పసిగట్టింది..!
పర్యాటకులు అందరూ ఖాళీ చేసిన కొద్దిసేపటికే మకావ్ బీచ్ తీరాన్ని సునామీ తాకింది. కానీ ముందుగానే సునామీని పసిగట్టడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 2004లో వచ్చిన సునామీలో ప్రాణనష్టం నమోదుకాని అతికొద్ది బీచ్‌ల్లో మకావ్ బీచ్ ఒకటి. టిల్లీ సమయస్ఫూర్తి వల్ల తామంతా ప్రాణాలతో బయటపడ్డామని పర్యాటకులంతా బాలికను ప్రశంసలతో ముంచెత్తారు.
ఇంగ్లాండ్‌కు చెందిన పెన్నీ స్మిత్, కొలిన్ స్మిత్‌లకు 1994లో టిల్లీ స్మిత్ జన్మించింది. చిన్నప్పటి నుంచే టిల్లీ చదువులో ఎప్పుడూ ముందుండేది. అంతేకాదు నిత్యం కొత్త విషయాలను నేర్చుకోవాలని ఆసక్తి చూపుతూ ఉండేది. తన తరగతిలో ఎప్పుడూ మొదటి ర్యాంకులోనే నిలిచేది. టీచర్లు చెప్పే పాఠాలను ఆమె ఆసక్తిగా వినేది. విన్న పాఠాలను ప్రకృతి పరిసరాలను గమనిస్తూ అర్థం చేసుకునేది. టిల్లీకి మిగతా సబ్జెక్టులకన్నా జాగ్రఫీ అంటే ఎంతో ఇష్టం ఉండేది. మాష్టార్లు చెప్పిన పాఠాల్లోలా భౌగోళిక పరిస్థితులు ఉన్నాయో లేదో పరిశీలించేది. తరగతి గదిలో నేర్చుకున్న విషయాలు వాతావరణంలో జరుగుతున్న మార్పులపై అవగాహన పెంచుకునేది టిల్లీ. తరగతి గదిలో ఉన్నప్పుడు కూడా స్నేహితులతో ఎప్పుడు వాన వస్తుందో చెప్పేది. వాతావరనంలో కలిగే మార్పులు తేమలో వ్యత్యాసాలను ఇట్టే కనిపెట్టేది. ఈ రోజు పెద్దవాన పడుతుందని ఇంట్లోవాళ్లతో ముందే చెప్పేది. ఆ మాటలను తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకునేవారు కాదు.
సముద్రంలో మార్పులను చూసి..
26 డిసెంబర్ 2004లో పదేళ్ల వయసులో ఉన్న టిల్లీ కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌లోని మకావ్ బీచ్‌ను సందర్శించేందుకు వెళ్లింది. సరదాగా బీచ్‌లో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు అక్కడున్నవారంతా. కొందరు సముద్రంలోదిగి ఈతకొడుతుండగా మరికొందరు బీచ్‌లోని ఇసుకలో ఆడుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఒక్కటై సరదాగా గడుపుతున్నారు. టిల్లీ కూడా సముద్రంలో ఈతకొడుతూ స్నేహితులతో ఆడుకుంటోంది. అయితే ప్రకృతి పరిసరాల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనించే టిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అలా ఆమె ఉలిక్కిపడటానికి కారణం వాతవరణంలో సంభవించిన మార్పే. తీరప్రాంతంలో ఉన్న నీటిమట్టం నెమ్మదిగా తగ్గుతుండటాన్ని టిల్లీ గమనించింది. అంతేకాదు సముద్ర నీటి ఉపరితలంపై చిన్న చిన్న బుడగలు రావడాన్ని గమనించింది. మరికొద్దిసేపట్లో ఇక్కడ సునామీ రాబోతుందని టిల్లీ పసిగట్టింది. ఇక్కడే ఉంటే ఈ బీచ్‌లో ఉన్నవారందూ సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అనుకున్న టిల్లీ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. మామూలుగా అయితే టిల్లీ మాటలను లెక్కచేయని తల్లిదండ్రులు సముద్రంలో మార్పులను చూసి ఆందోళన చెందారు. అక్కడున్న వారందరినీ ఒప్పించి అక్కడ నుంచి ఖాళీ చేయించగలిగారు.
రెండువారాల ముందే...
జాగ్రఫీ అంటే అమితంగా ఇష్టపడే టిల్లీ ఆ పాఠాలు విన్నవెంటనే దానికి సంబంధించిన ప్రకృతి మార్పులను ఎప్పటికప్పుడు గమనించేది. అలానే మకావ్ బీచ్‌ను సందర్శించే రెండువారాల ముందే పాఠశాలలో సునామీలు ఎలా వస్తాయి....? అన్న అంశంపై బోధన జరిగింది. టీచర్లు చెప్పిన అంశాలను జాగ్రత్తగా విన్న టిల్లీ మాయాకావ్ బీచ్‌లో వస్తున్న మార్పులను గమనించింది. టీచర్లు చెప్పిన అంశాలు, సముద్రంలో వస్తున్న మార్పులు ఒకేలా ఉండటంతో సునామీ రాబోతుందిని అక్కడున్నవారిని అప్రమత్తం చేసి వందలామంది ప్రాణాలు కాపాడింది టిల్లీ. వందలాది మంది ప్రాణాలు కాపాడిన టిల్లీకి ద మెరైన్ సోసైటీ సీ కాడెట్స్ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. టిల్లీని 2005లో ఐరాస విపత్తు అధికారులు సత్కరించారు. మీడియా ప్రతినిధులు ఇంటర్వూ చేయడానికి వచ్చిన టిల్లీ తల్లిదండ్రులు అందుకు అనుమతించలేదు.
– సాక్షి స్కూల్ ఎడిషన్