
జననేత కోసం జైల్‌భరో
సాక్షి నెట్‌వర్క్ : రాష్ట్ర విభజనలో సమన్యాయం కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సంఘీభావంగా సీమాంధ్ర జిల్లాల్లో పార్టీ శ్రేణులు జైల్‌భరో కార్యక్రమం నిర్వహించాయి. విజయవాడలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, నగర కన్వీనర్ జలీల్‌ఖాన్, రైతువిభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి తదితరులు అరెస్టయ్యారు. కడప వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ముట్టడించిన ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తదితరులు అరెస్టయ్యారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన జైల్‌భరోలో వెయ్యి మందిని అరెస్టు చేశారు. విశాఖ జిల్లా కంచరపాలెం పోలీస్‌స్టేషన్ వద్ద జైల్‌భరో చేపట్టడంతోపాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
అనంతపురంలో పార్టీ ఎమ్మెల్యేలు గుర్నాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట జైల్‌భరో కార్యక్రమం చేపట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సహా పదిమంది నేతలు, కార్యకర్తలు అరెస్టయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, బాపట్ల సముద్రంలో కోన రఘుపతి జలదీక్ష నిర్వహించారు. జగన్ కోసం నిడదవోలులో ముస్లిం మహిళలు ప్రార్ధనలు, భీమవరంలో వైఎస్సార్ సీపీ నేత గ్రంధి వెంకటేశ్వరరావు పూజలు నిర్వహించారు. చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. విజయనగరంలో సుజయ్‌కృష్ణ రంగారావు, పెనుమత్స సాంబశివరాజులతో పాటు వందలాది మంది కార్యకర్తలు జైల్‌భరోలో పాల్గొన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రావారిపాళెం పోలీస్ స్టేషన్ ముందు జగన్‌మోహన్‌రెడ్డి మాస్క్‌లు వేసుకుని మౌన దీక్ష చేపట్టారు.