అన్నదాతకు ఆదాయ భద్రత అక్కర్లేదా?
ద్రవ్యోల్బణాన్ని బట్టి ఉద్యోగుల జీతాలు పెరుగుతున్నా.. మద్దతు ధరలు పెరగటం లేదు. ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధర కూడా దక్కక 93% రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు చట్టబద్ధమైన ఆదాయ భద్రత అక్కర్లేదా? అంటూ పాలకులు, మేధావులను సూటిగా ప్రశ్నిస్తున్నారు
ఎం వీ ఎస్ నాగిరెడ్డి.
వ్యవసాయమే ప్రధానమైన మన దేశానికి ఆహార భద్రతనందిస్తున్న రైతు కుటుంబాలు అంతకంతకూ అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయన్నది ఎంతో ఆవేదన కలిగించే వాస్తవం. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఈ మధ్యనే విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 52% మంది రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో 93%, తెలంగాణలో 89% మంది రైతు కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. జూలై 2012- జూన్ 2013 మధ్యలో దేశవ్యాప్తంగా 35 వేల కుటుంబాలపై ఎన్‌ఎస్‌ఓఓ సర్వే చేసి ఈ నివేదికను వెలువరించింది. పది మందికీ పనికల్పించే రైతుల్లో 40% మంది ఉపాధి పనికి వెళ్లి పొట్టపోసుకుంటున్నారని కూడా ఈ నివేదిక చెబుతోంది. రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంతటి దుర్భరంగా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు.
అప్పుల ఊబికి విధానాలే మూలం
ఈ నివేదిక ప్రకారం.. 65 ఏళ్ల స్వతంత్ర భారతంలో 40% రైతు కుటుంబాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి. 11% రైతులకు మాత్రమే ప్రభుత్వ విస్తరణ సేవలందుతున్నాయి. దళారీలకు, ప్రైవేటు వ్యాపారులకే ఉత్పత్తులను రైతులు తెగనమ్ముకోవాల్సిన పరిస్థితులున్నాయి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఈ నివేదిక చెబుతున్న దానికంటే చాలా ఎక్కువ ప్రమాద భరితంగా ఉంది.
వ్యవసాయ సంక్షోభానికి కారణం రైతు పంట పండించలేక కాదు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో రైతు సంతోషంగా ఉన్నాడు. ఎక్కడా రైతుల ఆత్మహత్యల్లేవు. 1950 నుంచి 2012 నాటికి దేశ జనాభా 3.5 రెట్లు పెరిగితే ఆహార ధాన్యాల ఉత్పత్తి 7 రెట్లు, పాల ఉత్పత్తి పది రెట్లు, ఆక్వా ఉత్పత్తులు 13 రెట్లు పెరిగాయి. అయినా, ప్రభుత్వ విధానాల మూలంగానే రైతు అప్పుల ఊబిలోకి కూరుకుపోయి.. ఆత్మాభిమానం చంపుకోలేక కుటుంబ సభ్యులను అనాథలను చేస్తూ ఆత్మహత్యలపాలవుతున్నారు.
ఎవరు దీనికి బాధ్యులు?
పాలకవర్గాలు, శాస్త్రవేత్తలు కేవలం దిగుబడి పెంపుదల మీదే దృష్టిపెట్టారు. రైతు లాభదాయకత గురించి ఏమాత్రం ఆలోచించలేదు. పెరుగుతున్న పెట్టుబడులకనుగుణంగా మద్దతు ధరలు పెంచకపోవడం ఒక సమస్య. గిట్టుబాటే కాని ఆ మద్దతు ధరలకన్నా తక్కువకే రైతు తెగనమ్ముకుంటుంటే చోద్యం చూస్తున్నాం. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు రెండూ రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుండడమే ఈ సంక్షోభానికి కారణం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరి, పత్తి ప్రధాన పంటలు. ఉత్పత్తి వ్యయం దేశంలోనే ఎక్కువయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. కనీస మద్దతు ధరలు నిర్ణయించేటప్పుడు అన్ని రాష్ట్రాల ఉత్పత్తి ఖర్చును కలిపి సరాసరి ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల మన వరి రైతులే ఎక్కువగా నష్టపోతున్నారు. రాష్ట్రం క్వింటాలు ధాన్యం ఉత్పత్తి వ్యయం రూ. 1,708 అని చెబుతుంటే.. కేంద్రం రూ. 1,360 మద్దతు ధరగా ప్రకటించింది! రాష్ట్రంలో ధాన్యం ధర కేంద్ర ప్రభుత్వ బియ్యం సేకరణ మీదే ఆధారపడి ఉండడటం, సేకరణ విధానంలో లోపం మూలంగానే పెట్టుబడిని కూడా రాబట్టుకోలేక రైతు నష్టపోతున్నాడు.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. క్వింటా పత్తి ఉత్పత్తి ఖర్చు రూ. 5 వేలు. కేంద్రం మద్దతు ధర రూ. 4,050 అయితే రూ.3,700కే రైతులు అమ్ముకోవాల్సి వస్తున్నది. పత్తి మార్కెట్‌కు రాకముందే ఎగుమతి అనుమతులు ఇస్తే రైతుకు ధర వస్తుంది. కానీ, అమ్మకాలు పూర్తయ్యాక ఇవ్వడం వల్ల వ్యాపారులకే లబ్ధి కలుగుతోంది. వేరుశనగ, శనగ, మినుము, ఫంగస్ చేపల రైతుల పరిస్థితీ ఇంతే. ఎగుమతులు, దిగుమతులు రైతులకు నష్టం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మీద ఏ మాత్రం వత్తిడి పెట్టని మన రాష్ట్ర పాలకులే నేడు 90%పైగా రైతాంగం అప్పుల ఊబిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండటానికి కారణం.
ద్రవ్యోల్బణం నుంచి రైతును రక్షించనక్కర్లేదా?
గత కొంతకాలంగా వస్తువుల ధరలు 100-200% పెరిగితే వ్యవసాయోత్పత్తుల ధరలు 20-30% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ.. వ్యవసాయోత్పత్తులకు ఈ సూత్రాన్ని వర్తింపచేయకపోవటమే రైతును అప్పుల ఊబిలోకి దింపుతున్నది. ఉద్యోగుల వేతన సంఘ నివేదికలనైతే వచ్చీ రాగానే అమలు చేస్తున్నాం. రైతులకు ఆదాయ భద్రత కల్పించాలంటూ స్వామినాథన్ కమిషన్ నివేదిక ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు.
రైతు ముఖంలో చిరునవ్వు చూడాలంటే దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పినట్లుగా వ్యవసాయ వృద్ధి రేటును ఉత్పత్తిని బట్టి కాకుండా.. రైతు ఇంటికి తీసుకెళ్లే నికర లాభాన్ని బట్టి మాత్రమే పరిగణించాలి. నిరుపేదల కోసం ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రతా చట్టం తెచ్చాం. కానీ, 120 కోట్ల జనాభాకు తిండిపెడుతున్న రైతు కుటుంబాలకు కనీస ఆదాయ భద్రతనిచ్చే చట్టం చేయాల్సిన అవసరం లేదా? పాలకులారా, మేధావులారా ఆలోచించండి.
(వ్యాసకర్త వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షులు మొబైల్: 98480 43377)