కాకినాడలో 24 నుంచి పాలేకర్ 8 రోజుల శిక్షణా శిబిరం
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ (జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్) పద్ధతిలో పంటల సాగుపై పూర్తిస్థాయి 8 రోజుల శిక్షణా శిబిరం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ నెల 24 నుంచి 31 వరకు జరగనుంది. ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలను జీరోబడ్జెట్ పద్ధతిలో సాగు చేసే పద్ధతులపై పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు సుభాష్ పాలేకర్ సంపూర్ణ శిక్షణ ఇస్తారు. ఆయన ఆంగ్ల / హిందీ ప్రసంగాన్ని అప్పటికప్పుడే నిపుణులు తెలుగులోకి అనువదించి చెబుతారు. కాకినాడలోని భావన్నారాయణ ఆలయం సమీపంలో శ్రీచైతన్య పాలిటెక్నిక్ కాలేజీ (అశోక్ లేలాండ్ ఎదుట)లో శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ నిర్వహిస్తున్న ఈ ఉచిత శిక్షణా శిబిరంలో తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు కూడా ప్రవేశం కల్పించనున్నట్లు శిబిరం నిర్వాహక కమిటీ సభ్యుడు, ప్రకృతి వ్యవసాయదారుడు పెండేకంటి శరత్ ‘సాక్షి’తో చెప్పారు.
మహిళా రైతులకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులు 23వ తేదీ రాత్రికి లేదా 24వ తేదీ ఉదయం 8 గంటల లోగా కాకినాడ చేరుకోవాలి. శిక్షణ జనవరి 31న ముగుస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీన సర్టిఫికెట్ల పంపిణీ ఉంటుంది. శిక్షణ, భోజన, వసతి సదుపాయాలు ఉచితం. 5,500 మంది రైతులను మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారు మాత్రమే శిక్షణకు అర్హులు. ఈ నెల 21వ తేదీలోగా (ఈ మెయిల్ ద్వారా కూడా) పేర్లు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. పెండేకంటి శరత్ : 099898 53366, sarathpendekanti@gmail.com త్రినాథ్: 089770 97405, thrinadh45@gmail.com