మిత్ర పురుగులే రైతు సైన్యం
విష రసాయనాలు వాడకుండా పంటలు పండించాలంటే? ప్రకృతిలోని జీవరాసుల్లో మిత్ర, శత్రు బలగాల గుట్టుమట్లను కూలంకషంగా తెలుసుకోవాలి. జీవ నియంత్రణ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి. అప్పుడే.. రైతు జేబును, నేల సారాన్ని కొల్లగొడుతున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం నుంచి బయటపడగలం. ఇందుకోసం లోతైన పరిశోధనలు చేయాలి.
రైతులకు, వ్యవసాయ అధికారులకు, విద్యార్థులక్కూడా శిక్షణ ఇవ్వాలి. అంతేనా? ప్రభుత్వాలను ఒప్పించి క్షేత్రస్థాయిలో ఈ జీవ వ్యవసాయ పద్ధతులను అమల్లోకి తేవడం అన్నిటికన్నా ముఖ్యం. ఈ పనులన్నిటినీ చేస్తున్న ప్రభుత్వ సంస్థ ఏదైనా ఉందా? ఉంది! దానిపేరే ‘జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ’. కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఈ సంస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. నేల ఆరోగ్యంతో పాటు రైతు ఆరోగ్యం, సమాజ ఆరోగ్యానికి బలమైన పునాదులు వేస్తోంది...
సుస్థిర వృక్షారోగ్య యాజమాన్యానికి చిరునామా..
జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌ఐపీహెచ్‌ఎం) కేంద్ర వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ. హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో పశువైద్య కళాశాలకు ఎదురుగా దీని కార్యాలయం ఉంది. 1966లో సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ (సీఐపీపీ) పేరుతో ఏర్పడిన ఈ సంస్థ పేరు కాలక్రమంలో ఎన్‌ఐపీహెచ్‌ఎంగా మారింది. 2008 జూలై 25 నుంచి స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఏర్పడింది. వ్యవసాయ పర్యావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో వృక్షారోగ్య యాజమాన్యంలో సుస్థిరతను సాధించే లక్ష్యంతో పనిచేస్తోంది.
జాతీయ, అంతర్జాతీయ రంగంలో బోధన, శిక్షణ, పరిశోధనా, ధ్రువీకరణ, గుర్తింపు ఇచ్చే సాధికార సంస్థగా అవతరించింది. వ్యవసాయ రంగంలో జీవరక్షణ సంబంధమైన పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు ఒప్పందాలు కుదుర్చుకొంది. వివిధ రాష్ట్రాల వ్యవసాయ విస్తరణ విభాగాల అధికారులకు సుస్థిర వృక్షారోగ్య పద్ధతుల్లో శిక్షణ అందిస్తోంది.
పలు అంతర్జాతీయ సంస్థల విద్యార్థులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే వ్యవసాయ పరికరాల ఆవిష్కరణలకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తోంది. జీవరక్షణ విధానంలో విశేష అనుభవం, వ్యవసాయం పట్ల అమితాసక్తి కలిగిన ఐఎఎస్ అధికారి డాక్టర్ కె సత్యగోపాల్ ఈ సంస్థకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు. వ్యవసాయ పర్యావరణ పరిరక్షణ విధానాల్లో రైతు బృందాలకు నేరుగా శిక్షణ ఇవ్వడమే కాకుండా.. జీవ, వృక్ష, వ్యవసాయ శాస్త్ర పట్టభద్రులకు ఈ విధానాల్లో పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది.
మిత్ర పురుగుల అభివృద్ధిపై రైతులకు శిక్షణ ఇస్తాం
రైతులను మార్చడం సులభం కాదు అనేది ఒక దురాభిప్రాయం. తాను ఆశించిన ప్రయోజనాన్ని అందించే మార్గాలను చూపిస్తే తప్పక మారుతాడు. క్రిమిసంహారకాలంటే కేవలం రసాయనిక పురుగుమందులు మాత్రమే కాదు. వృక్ష సంబంధమైన కషాయాలు, కానుగ నూనె, వేప నూనె, సీతాఫలం నూనె కూడా ఈ కోవలోకే వస్తాయి. వీటితోనూ పంటలను ఆశించే చీడపీడల నివారణ, నియంత్రణ పూర్తిస్థాయిలో సాధ్యమే.
చీడపీడలను నివారించడానికి ఉపయోగపడే మిత్ర కీటకాలను పెంచి పోషించే పద్ధతులను, ట్రైకో డెర్మావిరిడి, సుడోమోనాస్, మైకోరైజా వంటి ముఖ్యమైన జీవ రసాయనాలను రైతు స్థాయిలో ఉత్పత్తి చేసుకునే విధానం ఎన్‌ఐహెచ్‌పీఎంలో శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న రైతు బయట రూ. వందలు పెట్టి కొనే ట్రైకో డెర్మావిరిడి, సూడోమోనాస్, మైకోరైజాలను రైతు కేవలం కొద్ది రూపాయల ఖర్చుతో తయారు చేసుకో గలుగుతాడు. వివిధ రకాల మిత్ర పురుగులను రైతు తన పొలంలోనే అభివృద్ధి చేసుకొనే పద్ధతులు కూడా ఈ శిక్షణలో భాగంగా నేర్పిస్తాం. కనీసం 30 మంది రైతులు బృందంగా ఏర్పడి సంప్రదిస్తే శిక్షణ రుసుం ఏమీ తీసుకోకుండా శిక్షణ ఇస్తాం.
- డాక్టర్ కే సత్యగోపాల్, డెరైక్టర్ జనరల్, జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్