నిబద్ధతకు నిక్కమైన నిర్వచనం
సందర్భం
నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. ఇది తెలుగు జాతి గర్వించదగిన రోజు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ పేరు ప్రముఖంగా విన్పించని రోజుల్లోనే ఆయన ఆ పార్టీకి ముఖ్యనేత. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయనే కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఈ పేరు సుపరిచితం. తెల్లటి చొక్కా, తెల్లటి పంచెతో దర్శనమిచ్చే 6 అడుగుల మాటల బుల్లెట్ వెంకయ్య నాయుడు. బీజేపీ జాతీయ నేతలు... అటల్జీ, అద్వానీజీ, ప్రమోద్ మహాజన్, సుష్మాస్వరాజ్, నరేంద్రమోదీ, అరుణ్ జైట్లీ ఇలా సీనియర్లందరూ వెంకయ్యాజీ అని పిలిచే సమున్నత వ్యక్తిత్వం ఆయనది. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షునిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జిగా, బీజేపీ జాతీయ అధ్యక్షునిగా, కేంద్ర మంత్రిగా ఇలా అనేక బాధ్యతల్లో వెంకయ్య ఒదిగిపోయారు.
ఎన్డీఏ ప్రభుత్వాల్లో తనదైన శైలితో ఒక ప్రత్యేక ముద్రతో కార్యకర్తలను, ప్రజలను, ఆకట్టుకోవడంలో వెంకయ్యది ప్రత్యేక స్టైల్. మాటల తూటాలతో దక్షిణాది రాష్ట్రాల్లోనే కాక, బిహార్, ఉత్తరప్రదేశ్, కేరళ, మిజోరామ్, జమ్మూ కశ్మీర్ ఇలా దేశ వ్యాప్తంగా అనేక పార్టీ బహిరంగ సభల్లో పార్టీ వాణి–బాణిని బలంగా విన్పించారు. హిందీ, ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ప్రత్యర్థి పార్టీలకు వేడి పుట్టించే ప్రసంగాలకు వెంకయ్య పెట్టింది పేరు. వెంకయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిం చారు. 4 సార్లు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆయన రాజ్యసభ ఎంపీనే.
2013 రాష్ట్ర విభజన సందర్భంగా పార్టీ ఎజెండా ప్రకారం రెండు రాష్ట్రాల నినాదాన్ని పార్లమెంట్‌లో బలంగా విన్పించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా జరిగిన చర్చల సందర్భంగా ఒకే ఒక్కడుగా వ్యవహరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు... పదేళ్లు కావాలని బల్ల గుద్ది మరీ చెప్పారు. పోలవరం ముంపు మండలాలు, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, విశ్వవిద్యాలయాలు, పోర్టులు, రోడ్లు, కేంద్ర సంస్థలు, ఇలా అనేక విషయాల్లో నాటి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి... బిల్లులో పెట్టించేలా చేశారు.
విభజన సమయంలో వెంకయ్య పోషించిన పాత్ర అనన్య సామాన్యం. ఓవైపు సొంత పార్టీ నేతలు, మోదీ, జైట్లీ, సుష్మా, అద్వానీలకు విభజన బిల్లులో లోపాలను వివరిస్తూ... మరోవైపు అధికార పక్షంతో ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని, కావాల్సిన సంస్థలు, రావాల్సిన నిధులు, పోలవరం ముంపు మండలాల విషయాలపై చర్చించారు. 3 నెలల సమయాన్ని విభజన చర్చల కోసం వెచ్చించడం చాలా మందికి తెలియని విషయం. ఆనాటి సీఎం చివరి వరకు పదవి కోసం ఆఖరి బంతి ఉందంటూ ప్రజలను మభ్యపెట్టడాన్ని మనంచూశాం. ఇక తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు ఆరుగురు ప్లకార్డులతో ఆందోళన వెలిబుచ్చారు తప్ప రాష్ట్రానికి ఏం కావాలో చెప్పనే చెప్పలేదు.
1985 నుంచి 1998 వరకు ఏ విధమైన పదవి లేకున్నా... ఒకే పార్టీలో ఉండి తన నిబద్ధతను చాటుకున్నారు వెంకయ్య. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు, ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత దూషణలకు దిగలేదు. కేవలం సిద్ధాంత రాజకీయాలపైనే విమర్శలు, ప్రతి విమర్శలు చేసేవారు. అలుపు లేకుండా ఈనాటికి ప్రభుత్వం, పార్టీ కార్యక్రమాల కోసం వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రానికి కొండంత అండగా ఉంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు రావడంలో, భారీగా నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించడంలో వెంకయ్య చొరవను, ప్రమేయాన్ని ఎవరూ కాదనలేరు.
పార్టీ ఏ పని చెప్పినా ఆ పని చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మంత్రిగా ఉన్నా, ఆ శాఖకు వన్నె తెచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా... అత్యంత సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా నాటి ప్రధాని వాజ్‌పేయి ప్రశంసను నేటి ప్రధాని మోదీ అభినందనలను వెంకయ్య పొందారు. పని రాక్షసుడిగా అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వం లోనూ పేరు తెచ్చుకున్నారు. అనేక సందర్భాల్లో పార్టీ దూతగా, ట్రబుల్ షూటర్‌గా వ్యవహరించారు. ఎప్పుడూ ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వెంకయ్య యువజన నేతగా, చిన్ననాటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో చేరి... దేశ నిర్మాణంలో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నారు. సంఘ్ శిక్షణలో ఒక సమర్థమైన క్రమశిక్షణ గల నాయకునిగా రాటుదేలారు.
నెల్లూరు జిల్లా చౌటపాలెంలో పుట్టిన వెంకయ్య 40 ఏళ్ల ప్రస్థానం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో 30 అబ్దుల్ కలామ్ రోడ్డు నుంచి ఉపరాష్ట్రపతి భవనానికి మారబోతోంది. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వెంకయ్య... ఇప్పుడు దేశ రెండో అత్యున్నత పీఠాన్ని అధిరోహించేందుకు రంగం సిద్ధమవుతోంది. మోదీ సర్కారులో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ... ప్రభుత్వానికి తల్లోనాలుకలా వ్యవహరించిన వెంకయ్యను బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వెంకయ్య... తెలుగు రాష్ట్రాల్లోనే కాక, దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీకి దిశానిర్దేశం చేశారు. కాకలు తీరిని రాజకీయ నేతల వేదికగా ఉండే రాజ్యసభలో మోదీ స్టైల్‌లో నడిపించాలంటే అందుకు వెంకయ్యే తగినవాడన్న అభిప్రాయం మోదీలో ఉంది. దక్షిణాదిన కాషా యం పార్టీకి పెద్ద దిక్కుగా నిలిచాడు. ఉత్తరాది పార్టీలో దక్షిణాది పోకడలను నింపాడు.
- పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com