తీర్పుల్లో గ్రంథ చౌర్యం!
సాంకేతికంగా అభివృద్ధి చెందిన కాలంలో సమాచారానికి కొదువ లేదు. ఏ విషయం గురించి కావా లంటే ఆ విషయం మీద ఎంతో సమాచారం లభిస్తుంది. రకర కాలైన ఆధారాల నుంచి సమా చారం లభిస్తుంది. ఏ వ్యాసం చదివినా ఎంతో సమాచారం లభిస్తోంది. కొత్త ఆలోచనలు కన్పిస్తున్నాయి. ఆ ఆలోచ నలు వాళ్ల సొంతమా? లేక ఎక్కడినుంచైనా తస్కరించారో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.
ఇంగ్లీషు పుస్తకాలు, కవితలు చదివిన తెలుగు కవులు.. ఆ కవుల ఊహలను తస్కరించి తెలుగులో కవిత్వం రాస్తు న్నారన్న అపవాదు ఉండేది. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. వ్యాసాలు రాస్తున్నప్పుడు చాలా విషయాలను ఉదహ రించాల్సి వస్తోంది. ఆ విధంగా ఉదహరించినప్పుడు అవి ఎక్కడి నుంచి సేకరించామో వాటిని ప్రస్తావించడం ధర్మం. ఆ విధంగా చేయకపోతే అది తప్పకుండా గ్రంథ చౌర్యం (ప్లాగియారిజం) అవుతుంది. ఈ కాలంలో గ్రంథ చౌర్యాన్ని దొరకబట్టడం అంత సులువైన విషయం కాదు. తెలివిగల వారు గ్రంథ చౌర్యం అని చెప్పే వీలులేకుండా గ్రంథ చౌర్యానికి పాల్పడుతున్నారు. మక్కీకి మక్కీగా పేర్కొన్న ప్పుడు మాత్రమే గ్రంథ చౌర్యం బయటపడుతుంది.
ఉద్దేశపూర్వకంగా గ్రంథ చౌర్యం చేసే వ్యక్తులు కొంత మంది ఉంటే, మరికొంత మంది అనుకోకుండా ఈ గ్రంథ చౌర్యాలకు పాల్పడుతుంటారు. సుప్రీం కోర్టు జడ్జిగా పని చేసిన న్యాయమూర్తి రూమాపాల్ 2011వ సంవత్సరం వీఎం తార్కుండే స్మారకోపన్యాసం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల గురించి ఓ తీవ్రమైన విమర్శ చేశారు. చాలా మంది న్యాయ మూర్తులు గతంలో జడ్జీలు చెప్పిన విషయాలనే తమ తీర్పుల్లో.. వాళ్లని కానీ, ఆ కేసులను కానీ ఉదహరిం చకుండా ప్రస్తావిస్తూ గ్రంథ చౌర్యానికి పాల్పడుతు న్నారని ఆమె ఆక్షేపించారు. ఆ విమర్శ అలా ఉండగానే అలాంటి తీర్పులు ఇంకా కన్పిస్తూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఈ మధ్య ఢిల్లీ హైకోర్టులో మరో సంఘటన జరిగింది. ఢిల్లీ హైకోర్టు తీర్పులో ఏకంగా కొన్ని పేరాలనే (4 నుంచి 37) ఓ వ్యాసం నుంచి ఉదహరించారు. అయితే ఆ వ్యాసకర్త పేరును తమ తీర్పులో ఎక్కడా ఢిల్లీ హైకోర్టు ఉదహరించలేదు. డిసెంబర్ 1, 2015 రోజున స్పైసీ ఐసీ బ్లాగ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రోచా వర్సెస్ సిప్లా కేసుకు సంబంధించిన తీర్పులో 4వ పేరా నుంచి 37వ పేరా వరకు ఉన్న విషయాలన్నీ క్వీన్ మేరీ జర్నల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నుంచి తస్కరించినవని, ఆ వ్యాసాన్ని రాసిన రచయితలు శ్వేతశ్రీ మజుందార్, ఈషాన్ ఘోష్ అని ఆ బ్లాగ్ పేర్కొంది. ఇదే విషయాన్ని ఆ రచయితలు తమ ఫేస్‌బుక్‌లో కూడా ప్రస్తావించారు.
నవంబర్ 27, 2015 రోజున ఢిల్లీ హైకోర్టులోని న్యాయమూర్తులు ప్రదీప్ నంద్రాజోగ్, ముక్తాగుప్తాలతో కూడిన ధర్మాసనం రోచాకేసులో అప్పీలును పరిష్కరిస్తూ తమ తీర్పును ప్రకటించింది. అదే కోర్టులో ఏకసభ్య న్యాయమూర్తి సెప్టెంబర్ 7, 2012న ప్రకటించిన తీర్పుపై వచ్చిన తీర్పులోని అప్పీలు అది. ఫేస్‌బుక్‌లో, బ్లాగ్‌లో ఈ విషయం ప్రస్తావించిన తరువాత అదే న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని తమకు తాముగా స్వీకరించి దిద్దుబాటు చర్యలు తీసుకుంది. ఆ పేరాలను తమ తీర్పు నుంచి తొలగించి మూల రచయితలకు క్షమాపణలు చెప్పారు.
ఆ పేరాలు తమ తీర్పులో కన్పించడానికి కారణం తమ న్యాయ సహాయకుడు అని (లా ఇంటర్న్) తేల్చారు. న్యాయమూర్తి వెలువరించిన తీర్పు 275 పేజీలు ఉండటం వలన దాన్ని సంక్షిప్తం చేయాలని తమ న్యాయ సహాయకులకు చెప్పామని, దాని ముసాయిదా ప్రతిలో ఆ న్యాయ సహాయకులు ఆ పేరాలు పెట్టడం వల్ల ఆ విధంగా జరిగిందని వివరణ ఇచ్చారు. ఈ విషయం తమ దృష్టికి రాగానే ఆ పేరాలను తొలగించడానికి విచారణను చేపట్టి అవి తొలగించామని కోర్టు పేర్కొంది. ఈ దిద్దుబాటు చర్యలను చాలా మంది స్వాగతిస్తున్నారు. మంచిదే. కానీ ఆ పేరాలు తీర్పులో కన్పించడానికి న్యాయమూర్తుల బాధ్యతను ఎవరూ ప్రశ్నించడం లేదు.
ఈ న్యాయసహాయకుల పద్ధతి సబార్డినేట్ కోర్టుల్లో లేదు. హైకోర్టుల్లో మాత్రమే ఉంది. న్యాయమూర్తులకు సమయం ఉండదు కాబట్టి న్యాయసహాయకుల, న్యాయ క్లర్కుల అవసరం ఏర్పడింది. అలాంటి న్యాయ సహాయ కుల వల్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇద్దరూ అపఖ్యాతికి లోనయ్యారు. న్యాయసహాయకులు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ న్యాయసహాయకులు అవసరమా?
న్యాయసహాయకుల పాత్ర చాలా కేసుల్లో ఉంటు న్నట్లు అనిపిస్తోంది. అరుణా శాన్ బాగ్ కేసు 2011(4) ఎస్‌సీసీ 454 కేసులో న్యాయసహాయకుల పాత్రను న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ ప్రశంసించారు. ఆ తీర్పు ఆ విధంగా తుదిదశకు చేరటానికి కారణమైన న్యాయక్లర్కులకు, న్యాయసహాయకులకు కృతజ్ఞతలను తమ తీర్పులో ప్రకటించారు. ఈ తీర్పును న్యాయ మూర్తులు ఖట్జూ, జ్ఞానసుధా మిశ్రాలు వెలువరించారు.
న్యాయసహాయకుల పాత్ర కేసుల పరిశోధన వరకు ఉంటే ఫర్వాలేదు. కానీ గ్రంథ చౌర్యం వరకు ఉండ కూడదు. తీర్పులను, న్యాయమూర్తులను ప్రభావితం చేయకుండా ఉండాలి. న్యాయసహాయకులు, న్యాయ మూర్తులు జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఢిల్లీ ఉదం తం మనకు గుర్తు చేస్తుంది.
సమాచారం ఎంత సులువుగా ఈ సాంకేతిక యుగంలో లభిస్తుంది అంటే గ్రంథ చౌర్యానికి పాల్పడ్డ వ్యక్తులు నేడు సులువుగా దొరికిపోతారు. ఉర్దూలోని ఓ నానుడి గుర్తుకొస్తుంది. న్రఖల్ కర్‌నే వాలోంకో అకీల్ రహానా కాపీ కొట్టేవాడికి కొంత జ్ఞానం ఉండాలి. న్యాయసహాయకుల తెలివితేటల్ని పూర్తిగా విశ్వసిం చకుండా చూడాల్సిన బాధ్యత ఆ సహాయం తీసుకున్న వ్యక్తులపై ఉంటుంది. గ్రంథ చౌర్యానికి సంబంధించి మన దేశంలో ప్రత్యేక చట్టం లేదు కానీ కాపీ రైట్ చట్టం పరిధిలోకి ఈ చర్యలు వస్తాయి.
మంగారి రాజేందర్, వ్యాసకర్త డిస్ట్రిక్ట్/సెషన్స్ జడ్జి (రిటైర్డ్),
మొబైల్ : 9440483001