
పాట తోడుగా సాగిన ప్రజాయుద్ధ నౌక
కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజా గాయకుడు గద్దర్
అజ్ఞాతంలో ఉన్నప్పుడు పులివెందులకు వెళ్లి వైఎస్ రాజారెడ్డికి వ్యతిరేకంగా పాట పాడితే వైఎస్ పిలిపించుకుని చాయ్ ఇచ్చి మరీ బాగున్నావా అన్నారు. నన్నూ, నా పాటనూ చాలా ఇష్టపడ్డారు. తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కొట్లాడి మరీ నాకు రక్షణ కల్పించారు. గద్దర్ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. గద్దర్ ఒక మాన్యుమెంట్ లాంటి వాడు. ఆయన్ని మనం కాపాడుకోవాలి అన్నారు.
రాజ్యాన్ని వ్యతిరేకించినందుకు చంద్రబాబు హయాంలో పోలీసులు నా గుండెలో తూటాలు దింపి ప్రాణం తీయాలని చూస్తే...అవసరమైన సమయంలో నాకు రక్షణ కల్పించిన వాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ప్రజలకోసం పోరాడే నిజమైన దేశభక్తులం కాబట్టే ఈ దేశం ఎవరిదని ప్రశ్నిస్తూ, ఈ దేశం దుక్కులు దున్నే రైతుదీ, మొక్కలు నాటే రైతుదీ అని పాట గట్టి పాడామని గద్దర్ అంటున్నారు. ఇంతవరకు ఓటు ఎవరికీ వేయకున్నా రాజ్యాంగాన్ని మన పాలకులు 25 శాతం మేరకైనా అమలు చేస్తే అదే పదివేలు అంటున్న గద్దర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
మీ పాటనై వస్తున్నాను అనే పదం ఎలా కనిపెట్టారు. ఆ పాట అద్భుతంగా ఉంటుంది?
పాటలు ఎలా వస్తాయి. మాటల్లో బావా వస్తివా అంటాం దానికి కాస్త రాగం పెడితే.. బావా వచ్చితీవా ఆ..ఆ. అంటే పాటవుతుంది. నేను ఎక్కడికి పోయినా అన్నా పాట పాడే.. పాట పాడే అన్నప్పుడు పాట వస్తుంది. జనం నన్ను చూడంగానే పాట. ఎక్కడికి పో... పెళ్లికి పో.. పోలీసు స్టేషన్‌కు పో.. ఎక్కడికి పోయినా పాట. అందుకే మీ పాటనై వస్తున్నాను.. మీ పాదాలకు వందనం అని ట్యూన్ చేసుకున్నాను.
మీ జీవితం నేర్పిన అనుభవం, మీ జీవితం నేర్పిన పాఠం ఏమిటి?
ప్రజలకు సేవ చేయాలన్న అక్షరం, గొంతు, కలం. మనమంతా కలం సైనికులం. కలం నిరాయుధులం. ఆయుధం పట్టుకోం. బ్రెయిన్‌తో డీల్ చేసేవాళ్లం కాబట్టి వేమన, పోతన, అన్నమాచార్య, రవిదాస్, సంత్‌లు వాళ్లూ వీళ్లూ ఈ భారత సమాజంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల జీవన విధానాన్ని ఒక రాగంలో, ఒక గానంలో ఆత్మతో ఆత్మ మాట్లాడుకోవడం.. అలాంటి వాళ్లు ప్రజల్లో సజీవంగా ఉంటారనే ఒక అనుభవం నాకు వచ్చింది. అలాంటి ఆదరణే నేను ప్రజలనుంచి పొందగలిగాను.
గాయకుడిగా మీ పరిణామక్రమం?
నా చిన్నప్పుడే మా అమ్మ జానపద పాటలు పాడేది. మా అమ్మ, నాన్న.. మా కుటుంబం నిజాం రాష్ట్రం నుంచి ఔరంగాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ మిళింద్ విద్యాలయాన్ని కట్టినప్పుడు నాన్న అక్కడే అంబేద్కర్‌ని కలిశాడు. నాన్నకు మరాఠీ బాగావచ్చు. అమ్మ కూడా అక్కడే పనిచేసింది. పిల్లలు చదువు కోవాలనే ప్రభావం నాన్నకు అంబేద్కర్ నుంచే పడింది. దాంతో చిన్నప్పుడే మా గోడల మీద రాసేవారు.. జ్ఞానమొక్కటి మిగిలిపోవును.. అక్షరం నేర్చుకో, చదువుకో అనేవారు. అదే నామీద ప్రభావం వేసింది. నేను మెదక్ జిల్లా తూప్రాన్‌లోనే పుట్టాను. మా అమ్మ మరాఠీలో మంచి పాట పాడేది. నేను దాన్ని తెలుగులో అల్లుకుని పాడుకునేవాడిని. నా గొంతు మా అమ్మ గొంతులోంచే పుట్టింది.
ఇప్పటికీ మీరు నక్సలైటు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా?
సమాజంలో జరుగుతున్న దోపిడి పోవాలనేదే నా సిద్ధాంతం. మానవతావాదం కాదు నాది. అందుకే.. ‘దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకురోరన్నా.. మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో బెట్టిండ్రోరన్నా.. మాటలు రానీ మూగజీ విపై లాఠిదెబ్బలేలా నాయన.. ఈ ధర్మ యుద్ధములో మీరేవైపో మీరె దేల్చుకుండో నాయన..’ అంటూ పాడాను.
మీపై కాల్పులు ఎందుకు జరిగాయి? ఆరోజు ఏం జరిగిందో మీకు గుర్తుందా?
ఎన్‌కౌంటర్ అయినవారి మృతదేహాలను స్వాధీనం చేయమని అడిగాం. అది నేరుగా రాజ్య యంత్రాంగంతో ప్రత్యక్ష ఘర్షణగా మారింది. మరి రాజ్యం ఊరుకోదు కదా. 1997 ఏప్రిల్ 6. నాపై కాల్పులు జరిగి ఇరవై ఏళ్లు అయిపోతోంది. ఎందుకు కాల్చారంటే.. బయటికి వచ్చాక ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. రెండోవైపు ఎన్ కౌంటర్లు.. మరోవైపు ఎవరిదో ఉరిశిక్ష రద్దు చేయాలి అనే పోరాటం.. అనేక రకాలుగా నేను తిరుగుతున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 1997 మార్చి 8 నాడు ఒక తీర్మానం జరిగింది. ఏప్రిల్ 6న నాపై దాడి జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని నేను ప్రోత్సహిస్తున్నాననే అనుమానమే నాపై దాడికి కారణం.
చంద్రబాబుకు, ఎన్టీఆర్‌కి తేడా ఏమిటి?
నేను రాజకీయాలను ప్రస్తావించదలచుకోలేదు. కానీ.. పాలసీలు, అధికారం విషయం పక్కన బెడితే ఎన్టీఆర్ మాస్ లీడర్. చంద్రబాబు పక్కా రాజకీయ నాయ కుడు. బాబుది హైటెక్ సిటీ పాలన. కానీ నేనేమంటానంటే భారతదేశంలో లక్షా 20 వేల గ్రామాలున్నాయి. గ్రామ పునాదిగా ఎకానమీని తీసుకుంటే ఏ పాలకుడి పాల నైనా మంచిగా ఉంటుంది.
ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మీరు ఇప్పుడెలా ఫీలవుతున్నారు?
మేం ప్రజా కళాకారులుగా అడవిలో ఉన్నప్పుడు ఒక దుప్పిని వేటాడాం. ఆ గూడెంలో ఒక చెల్లి, ఇతరులు ఉన్నారు. మాంసం అందరికి తలొక పాలు వేసి ఆ చెల్లెకు మాత్రం రెండు పాళ్లు వేశాం. అడవిలో పద్ధతి తెలీదు నాకు. అందుకే మా దళనాయకు డిని అడిగాను. అందరికీ తలొక పాలే కదా. ఆ చెల్లికి మాత్రం రెండుపాళ్లు ఇచ్చారు. ఆమె గూడేనికి పెద్దా అని అడిగాను. కాదు గద్దరన్నా.. ఆ చెల్లె కడుపుతోటి ఉంది. లోపలున్న బిడ్డకు ఒక పాలు, తల్లికి ఒక పాలు ఇచ్చామన్నా అన్నాడు దళ నేత. అలాగే తెలం గాణలో కూడా త్యాగాలు చేసిన, ప్రాణాలిచ్చిన వారికి చెందవలసింది ఇస్తేనే ఆ త్యాగాల తెలంగాణ ధన్యమవుతుంది. ఇప్పటికే మాకు నీళ్లు రాలా, మాకు కొలువులు రాలా, మాకు ఇవి రాలా, అవి రాలా అని ఉద్యమాలు మొదలవుతున్నాయి.
వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా మీకు సంబంధాలున్నాయి కదా?
వైఎస్సార్‌ది ఒక ప్రత్యేకత. ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలో ఉంటూ కడపకు పోయి పులివెందుల ప్రాంతంలో వైఎస్ తండ్రి రాజారెడ్డిపై పాటలు గట్టి ప్రచారం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా పాటలు పాడతావా అని నా చేతులు కట్టేసి పట్టుకుపోయారు. ఎవరు నువ్వు అని ఇడిగితే ఇంజనీరింగ్ చదివినా, ప్రజలను ఆర్గనైజ్ చేస్తా అన్నాను. కడపలో నువ్వేం ఆర్గనైజ్ చేస్తావురా బాబు అన్నాడు రాజారెడ్డి. ఈలోపు వైఎస్సార్‌కి తెలిసింది. వెంటనే తనవద్దకు రప్పించుకున్నాడు. తాగేందుకు చాయ్ ఇచ్చాడు. బాగున్నావా అనడిగాడు. చాలా ఇష్టపడ్డాడు. అది పాత మాట. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ఉత్తరువు తెచ్చాడు. గద్దర్ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన భార్య వచ్చి కలిసి మాట్లాడింది. గద్దర్ ఒక మాన్యుమెంట్ లాంటివాడు. ఆయన్ని మనం కాపాడుకోవాలి అన్నారు వైఎస్‌ఆర్. ఆ మాట చాలు కదా. అప్పుడే నాకు రక్షణ వచ్చింది. మిగతా ఎవరి పాలనలోనూ నాకు రక్షణ ఇవ్వ లేదు. అసెంబ్లీలో వైఎస్సార్ నాగురించి కొట్లాడిన తర్వాతే నాకు రక్షణ వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అనేకసార్లు కలిశాను. అక్కడ సూరీడు చాయ్ ఇవ్వబోతే ‘నువ్వివ్వకు లక్షలాది మంది ప్రజలను కదిలించినవాడు. నేనే ఇస్తాను’ అని వైఎస్ స్వయంగా నాకు టీ ఇచ్చారు. నా పాట లంటే ఆయనకి చాలా ఇష్టం. ‘రక్తమిచ్చినా రాయలసీమకు ఏమిస్తవురో రామన్నా..’ ఈ పాట చాలా ఇష్టం ఆయనకు. పదే పదే పాడించుకునేవారు. పోలీసులు ఎవరినో పట్టుకున్నారు.. కాల్చేసే ప్రమాదముందని నేను క్యాంప్ ఆఫీసుకు గోసీ గొంగడేసుకుని వెళితే ఏంటని అడిగారు. మీ పోలీసులు ఎవరినో పట్టుకున్నారట. కాల్చేస్తారట, మీరు కాస్త చూడాలి అంటే అలా చేయవద్దంటూ అప్పటికప్పుడే సంబంధిత వ్యక్తులకు ఆదేశా లిచ్చారు. ఎన్టీరామారావును, చంద్రబాబునాయుడిని కూడా చాలాసార్లు కలిసాను. కానీ వీరందరిలో వైఎస్‌ఆర్‌ది ఒక ప్రత్యేకత.
ఇంతకూ మీ రాజకీయ లక్ష్యం ఏమిటి?
నేను విప్లవోద్యమంలో జీవించాను. నా పాటలు విని లక్షలాది ప్రజలు పోరా టంలోకి వచ్చారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగా ణమా.. పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు.. చిదిమేసిన పువ్వులు.. త్యాగాల గుర్తులు.. మా భూములు మాకేనని మర్ల బడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా. ఇదీ నా లక్ష్యం. మీద్వారా, సాక్షి ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తున్నాను. పౌరహక్కుల ఉద్యమం, పాటల ఉద్యమం, సాహిత్య ఉద్యమం పట్ల ఆయన చాలా సానుకూలంగా ఉండాలి. ఎన్‌కౌంటర్లు చేశారు. చిన్న చిన్న విషయాల్లో, మీటింగులు పెట్టే దగ్గర అందరికీ అవకాశమివ్వండి. ఏముంది క్కడ. ఎన్ని మీటింగులు పెట్టలేదు అందరం కలిసి. ఎవరైనా ఒక్క ఇందిరా పార్కు దగ్గర మీటింగు పెట్టగానే ప్రభుత్వం వచ్చేస్తుందా. గ్రామాల్లో కేసీఆర్ అంటే ఇప్పటికీ కొన్ని నమ్మకాలున్నాయి. ఆ నమ్మకాలు కోల్పోయేలా వ్యవహరించవద్దు.
(గద్దర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి)
https://www.youtube.com/watch?v=uxjMKWL2ooM