వచ్చినవాడు గద్దర్.. ఇది 1982లో ఒక పత్రికలో వచ్చిన శీర్షిక.. అప్పటికే జర్నలిస్టుగా ఉన్నప్పటికీ నాకు అంతవరకు అసలు గద్దర్ అంటే ఎవరో తెలియదు. కానీ ఆ వార్త చూశాక ఆయన గొప్పదనం ఏమిటో చూడాలని తిరుపతిలో జరిగిన సభకు వెళ్లాను. అక్కడ వేలాది మంది జనం ఉన్నారు. గద్దర్ వేదిక ఎక్కి గజ్జె కట్టి పాటలు పాడుతుంటే మైమరచిపోయామంటే అతిశయోక్తి కాదు. నిజానికి అవన్నీ విప్లవ ఉద్యమానికి సంబంధించిన గేయాలు. వాటిలో అత్యధికం ఆయన స్వయంగా రాసి పాడిన పాటలు. పై చొక్కా తీసివేసి ఒక నల్ల దుప్పటి భుజాన వేసుకుని పాట పాడడం, దానికి అనుగుణంగా డాన్స్ చేయడం సరికొత్త బాణిగా కనిపిస్తుంది.
బ్యాంక్ ఉద్యోగం చేస్తూ విప్లవోద్యమంలోకి వెళ్లడం, తిరిగి ఆయన బయటకు వచ్చి పాటకు అంకితం అవడం గొప్ప విషయం. ఆయన ఒక స్కూల్ కూడా నడిపారు. నక్సలిజం నుంచి బయటకు వచ్చినా ఆ బాటను ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు. వారి తరపున ఒక సాంస్కృతిక వారధిగా ఆయన పనిచేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్‌కౌంటర్లు జరిగినా అక్కడకు వెళ్లి వారి కుటుంబాలకు అండగా నిలబడేవారు. ఒక మాటలో చెప్పాలంటే జానపద, విప్లవ గేయాల రచనలో, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లిన తీరు గద్దర్‌కు ముందు, గద్దర్‌కు తర్వాత అన్న చందం అని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు.
ఆయన పాటలలో ఎల్లప్పుడూ అట్టడుగు, అణగారిన ప్రజల వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి ఏ బండ్లో వస్తవు కొడకా.. నైజాం సర్కరోడా అంటూ ఆయన చేసిన అలాపన ఎప్పటికీ ప్రజల చెవుల్లో రింగురింగుమంటూనే ఉంటుంది. అదేకాదు. ఎన్నియలో.. ఎర్రెర్రని జెండా ఎన్నియలో.. యంత్రమెట్ల తిరుగుతుందంటే.. నీ పాదం మీద పుట్టుమచ్చనై.. ఇలా ఒకటేమిటి అనేకం ఉన్నాయి. వాటిలో భావం, భాష అద్బుతంగా ఉంటాయి. చిన్నచిన్న పదాలతో ప్రజలందరికి అర్ధం అయ్యేరీతిలో ఆయన పాడే వైనం అపురూపం అని చెప్పాలి.
గద్దర్ వేదిక ఎక్కితే ఒక సింహం మాదిరిగా ఉంటుంది. ఆయన పల్లవి ఎత్తుకుంటే అందరిని కదలించివేస్తుంది. అంతా మమేకం చెందవలసిందే. సాహిత్యం, సంగీతం కలిపి ఆయన సరికొత్త పాటను సృష్టించారు. ఆ రోజుల్లో గద్దర్ పాటల క్యాసెట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అందులోని సాహిత్యం విప్లవానికి సంబంధించింది అయినా, అందులోని భావజాలంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఆ పాటలలోని స్పూర్తి అందరిని ఆకట్టుకునేది. చాలాకాలం విప్లవోద్యమానికి బహిరంగ ప్రజాస్వరం మాదిరి వ్యవహరించారు.
చదవండి: గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు
తర్వాత కాలంలో ఆయన దానికి పూర్తిగా దూరం అయినా, విప్లవ భావజాలం, పేదలు, బలహీనవర్గాల కష్ట, సుఖాలపై తన అనురక్తిని మాత్రం వీడలేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1997లో ఆయనపై కాల్పులు జరిగాయి. అది పోలీసుల పనే అని, ఆనాటి ప్రభుత్వమే ఆయనపై హత్యకు కుట్ర పన్నిందని పలువురు ఆరోపించేవారు. ఆ కాల్పులలో బులెట్ ఆయన వెన్నులో దిగింది. అయినా అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డారు. ఆయన ఆ బుల్లెట్‌తోనే జీవితం గడిపారు.
దానివల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలకు గురి అయినా తన వాణిని మాత్రం జనంలో వినిపించడానికి వెనక్కి తగ్గలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకటి, రెండుసార్లు గద్దర్ కలవడం పెద్ద వార్త అయ్యేది. వైఎస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటివాటిని ఆయన మెచ్చుకునేవారు. అలాగే వైఎస్ పీపుల్స్ వార్ తీవ్రవాదులతో శాంతి చర్చలు జరపడం ఒక చరిత్ర. వాటన్నిటిలో ఆయనకు ఒక పాత్ర ఉండేది. ఆ క్రమంలోనే వైఎస్సార్ ఆనాటి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి వారి డిమాండ్లపై అధ్యయనం చేయించేవారు. వాటిలో ఆచరణసాధ్యమైనవాటిని ఆయన అమలు చేసేందుకు యత్నించారు.
గద్దర్‌కు వేలాది మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన మాదిరి పాడాలని, ఆయన మాదిరి ఎగెరెగిరి డాన్స్ చేయాలని, ఉచ్చస్వరంతో పలకాలని చాలామంది కోరుకునేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక నిరసన కార్యక్రమాలలో కాని, రాజకీయ పార్టీల సభలలోకాని, పండగలు, పబ్బాలు జరిగినప్పుడు కాని, ఇలా ఏ సందర్భం అయినా గద్దర్ తరహా పాటలు పాడడం ఒక సంస్కృతిగా మారిందంటే ఆశ్చర్యం కాదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అంకితం అయి పనిచేశారు. పోరు తెలంగాణమా.. అంటూ ఆయన రాసిన పలు గీతాలు ఉర్రూతలూగించాయి.
చదవండి: ‘బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి’
ఈ ఉద్యమంలో గద్దర్ బాణినే అన్ని చోట్ల మారుమోగుతుండేది. తెలంగాణ ఉద్యమకారులు ఈ పాటలు విని ఉర్రూతలు ఊగేవారు. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. కారణం ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టడానికి ఈ మధ్య డిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వెళ్లి వచ్చారు.
ఆయన రాజకీయాల సంగతి ఎలా ఉన్నా , గద్దర్ పాట ఎప్పటికి చిరస్మరణీయంగానే ఉంటుంది. గద్దర్ కేవలం తెలంగాణ ఆస్తి మాత్రమే కాదు. తెలుగు ప్రజలందరి సొత్తు అని చెప్పాలి. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన సంతాప సందేశంలో గద్దర్‌ను ఒక సామాజిక న్యాయ ప్రవక్తగా అభివర్ణించారు. గద్దర్ పాటకు మరణం లేదు. గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాట రూపంలో ఎప్పటికీ మన మధ్యే జీవించే ఉంటారు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment