అత్యున్నతపీఠంపై అసామాన్యుడు
సందర్భం
దళితుల్లో పుట్టి స్వయం కృషితో ఎదిగి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపికైన రామ్‌నాథ్ కోవింద్ వంటి విశిష్ట వ్యక్తి విషయంలోనూ రాజకీయం నడపడం, పోటీ పెట్టడం కాంగ్రెస్ పార్టీకే చెల్లు.
ఈ దఫా రాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎన్డీయే తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ వ్యతిరేకత కారణంగా ఆ ప్రయత్నం వమ్మయింది. ప్రతిపక్షాలు సరైన వ్యక్తిని సూచిస్తే మద్దతివ్వడానికి కూడా సిద్ధమేనంటూ బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసినప్పటికీ కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు తిరస్కరించాయి. రాజకీయంగా అవినీతి ఆరోపణలలో చిక్కుకుపోయిన ప్రతిభా పాటిల్‌నే ఆనాడు రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంచుకుని గెలిపించి అప్రతిష్టను మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు రామ్‌నాథ్ కోవింద్ వంటి దళిత రాజకీయవేత్తపై బురద జల్లడానికి కూడా సాహసించడం విచారకరం.
సమాజంలో అట్టడుగువర్గాల్లో జన్మించిన రామ్‌నాథ్ కోవింద్‌ది విశిష్టమైన వ్యక్తిత్వం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భావజాలంలో పుట్టి పెరిగిన కోవింద్ ప్రజాజీవితంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తొలిసారిగా 1990లో లోక్‌సభ ఎన్నికల్లో ఘటంపుర్ నుంచి బరిలోకి దిగారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎంపీ కోటాలో తనకు కేటాయించిన నిధుల ద్వారా వచ్చిన సొమ్మును ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అనేక పాఠశాలల నిర్మాణానికి, వాటి అభివృద్ధికి ఖర్చు చేశారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చేపట్టాల్సిన పథకాలను నాటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయికి విన్నవించి వాటి పరిష్కారాల కోసం కృషి చేశారు.
సివిల్ సర్వెంట్‌గా దేశానికి సేవలందించాలని కలగన్న కోవింద్ మూడో ప్రయత్నంలోనే విజయం సాధించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరలేదు. తనకు ఇష్టమైన, తన ప్రవృత్తికి దVýæ్గరైన న్యాయవాదిగా కొనసాగారు. నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వద్ద కొంత కాలం ప్రైవేటు సెక్రటరీగా పనిచేసి ప్రభుత్వ యంత్రాంగాలకు సంబంధించిన విషయాల్లోనూ అనుభవం గడించారు. తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులను ప్రజలకు, తన గ్రామానికి ఇచ్చేసి యూపీ ప్రజల్లో గుర్తింపు పొందారు. నిబద్ధతతో నిరాడంబర జీవితాన్ని గడిపే వ్యక్తిగా సుపరిచితులు.
అయితే రాష్ట్రపతి ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం ఎంతో గొప్ప ఆశయంతో ముందడుగేయాలని భావించినప్పటికీ.. అది కుదర్లేదు. దేశానికి ప్రథమ పౌరుడి ఎన్నిక ఎలాంటి వివాదాలు, విభేదాలు లేకుండా జరగాలని ప్రధాని మోదీ భావించారు. అందులో భాగంగానే ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతోనూ, కమ్యూనిస్టులతోనూ ఎన్డీఏ కమిటీ సభ్యులు చర్చించారు. ఈ కమిటీ సభ్యులైన కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య దేశంలోని కీలక పార్టీలన్నిటితో చర్చించి, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం కావాలని, అదే ప్రధాని ఉద్దేశమని స్పష్టం చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను అభ్యర్థిగా సూచించినప్పుడు నాటి ప్రధాని వాజ్‌పేయి వ్యవహరించిన అదే పంథాను మోదీ కొనసాగించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అందుకు నిరాకరించింది.
రాజకీయ విభేదం ఉంది కాబట్టే... రాష్ట్రపతి ఎన్నికను కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. బీజేపీకి, మోదీకి క్రెడిట్ ఇవ్వకూడదన్న దురుద్దేశంతోనే... కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి గండికొట్టింది. అయితే ఎన్డీఏలో భాగస్వాములు కాని అనేక పార్టీలు స్వచ్ఛందంగా రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తామని ప్రకటించాయి. ముఖ్యంగా ఒడిశాలోని బీజేడీ, తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీ, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీ, బిహార్‌లోని నితీష్ కుమార్, జేడీ యూ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ.. ఎన్డీఏ అభ్యర్థికి సహకరిస్తామని విస్పష్టంగా చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం 17 పార్టీలు రావ్‌ునాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయని చెబుతోంది. ఎన్డీఏ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కాంగ్రెస్ దుష్ట రాజకీయమే. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ప్రతిపక్షాలను సైతం ఒక్కతాటిపై నిలబెట్టలేకపోయింది. బీజేపీపై దాడి చేయాలని కాంగ్రెస్ పార్టీ కన్న కలలు మరోసారి విఫలమయ్యాయి.
వైఎస్ జగన్ పరిపక్వత అభినందనీయం
ఇక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ బలపర్చిన అభ్యర్థికి మద్దతిస్తామంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించాలి. రాజకీయంగా ఎంతో పరి పక్వత ప్రదర్శించి రాష్ట్రపతి ఎన్నికలో మోదీ సూచించిన అభ్యర్థికి మద్దతిస్తానని చెప్పడం... సహజంగా, అధికార టీడీపీ వర్గాలను కలవరపెడుతోంది. టీడీపీ ఎంతగా విమర్శించినప్పటికీ వైసీపీ అధినేత జగన్ వ్యవహరించిన తీరు అభినందనీయమని చెప్పాలి. అభ్యర్థిని ప్రకటించకముందే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతిస్తానని మోదీతో చెప్పడం టీడీపీకి మింగుడుపడలేదు. జగన్ నిర్ణయంతో టీడీపీ అసహనంతో కంగారుపడి బెంబేలెత్తిపోతోంది. జగన్ నిర్ణయంతో టీడీపీ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందన్నది వాస్తవం. అందుకే టీడీపీ దీనిపై చిలువలు పలువలు అల్లి విమర్శలు గుప్పిస్తోంది. ఏదేమైనా జగన్‌మోహన్ రెడ్డి రాజకీయ చతురతను ప్రదర్శించడం శుభపరిణామం.
ఒక్కటి మాత్రం నిజం... దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు సంబంధించి పూర్తి మద్దతు సంపాదించిన రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా కాంగ్రెస్ కుటిల రాజకీయాలు మరోసారి రుజువయ్యాయ్. తాను చెడిందే కాకుండా... దేశంలోని ఇతర పార్టీలను సైతం చెడగొట్టే దుష్ట సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ తెరదీసింది. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన కోవింద్ దేశ అత్యున్నత స్థానంలో కుర్చోవడం ద్వారా ప్రపంచానికి మన దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనం చాటినట్టవుతుంది.
- పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, ఢిల్లీ
ఈ–మెయిల్ : raghuram.delhi@gmail.com