
విజయగనరం / గుర్ల(చీపురుపల్లి): గుర్ల మండలానికి చెందిన టీడీపీ నేతలు నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ఆదివారం ప్రధాన కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విచిత్రం ఏంటంటే ఆ ఫ్లెక్సీల్లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు ఫొటో లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే మంత్రులు, స్థానిక చిన్నా, చితకా నేతల ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో టీడీపీ నాయకులే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మరి కొందరేమో ఒక అడుగు ముందుకేసి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారా..? లేక ముఖ్యమంత్రిగా విఫలం అయ్యారా..? లేక కార్యకర్తల సంక్షేమాన్ని పట్టించుకోకుండా, తన సంక్షేమం కోసమే పని చేస్తున్నారని కార్యకర్తలు అనుకుంటున్నారా..? అన్న సందేహాలను వెలిబుచ్చుతున్నారు. ఈ మేరకే ఆయన ఫొటోలను ఫ్లెక్సీల నుంచి తొలగించి ఉండొచ్చని పేర్కొంటున్నారు. మండలం మొత్తం మీద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై టీడీపీ నేతలను వివరణ అడగ్గా ముద్రణ సమయంలో జరిగిన పొరపాటే కారణమని పేర్కొన్నారు.